● 17 నుంచి 20 వరకు
వివిధ కార్యక్రమాలు
● శిల్పారామం ఏఓ శివప్రసాద్‌రెడ్డి
కడప సిటీ : కడప నగర పరిధిలోని శిల్పారామంలో దసరా ఉత్సవాల సందర్భంగా నాలుగు రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఏఓ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. గురువారం కడపలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఆయన ఏఈ వెంకట సుబ్బయ్య, సీనియర్ అసిస్టెంట్ రామచంద్రతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈనెల 17న హర్ష జింబో డ్యాన్స్ అకాడమి, 18న సాయి డ్యాన్స్ అకాడమి, 19న నటరాజ్ డ్యాన్స్ అకాడమి, 20న శిల్పారామం నృత్యాలయం తదితర కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి కలెక్టర్ డాక్టర శ్రీధర్ చెరుకూరి, సీఈఓ స్వామినాయుడు హాజరు కానున్నట్లు తెలిపారు. శిల్పారామంలో అంగరంగ వైభవంగా ధూం..ధాం....దుమ్ముదులిపే డ్యాన్స్‌లతో ఈ దసరాకు కడప శిల్పారామం సాంస్కృతిక వేదిక కానుందన్నారు. ఈ కార్యక్రమాలు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు. ప్రముఖ బుల్లితెర టీవీ యాంకర్లచే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అంతకుముందు వారు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
సాంకేతికతతోనే మహిళా రైతులకు ఆర్థిక ప్రగతి
కడప అగ్రికల్చర్: మహిళా రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను, శాసీ్త్రయ పద్ధతులను పాటించడం ద్వారానే ఉత్పాదకతను పెంచి, ఆర్థికంగా ఎదగగలరని జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావు, కేవీకే అధిపతి సునిల్‌కుమార్ పేర్కొన్నారు. ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఆధ్వర్యంలో గురువారం వ్యవసాయ పరిశోధనా స్థానంలో మహిళా రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పంటల సాగు, పశుపోషణ, కోత అనంతర నిర్వహణలో మహిళల పాత్ర ఎంతో కీలకమన్నారు. కేవీకే ద్వారా మహిళలకు ఆధునిక సాంకేతికత, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, పోషకాహార తోటల పెంపకంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో వ్యవసాయ రంగానికి సేవలు అందించిన ముగ్గురు మహిళా రైతులకు ఘన సత్కారం చేశారు. అనంతరం జరిగిన రైతు–శాస్త్రవేత్తల ముఖాముఖిలో రైతుల పంట సమస్యలకు శాస్త్రవేత్తలు తగిన పరిష్కారాలు సూచించారు. ప్రధాన శాస్త్రవేత్త డా. యం. శ్రీనివాస చారి, కేవీకే శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.


