● టీడీపీ ఆఫీసులో సన్నిహితుల ఇళ్లల్లో తిష్ట వేసిన అల్లరిమూకలు
● పులివెందులలో వీరంగం
సృష్టించేందుకు సన్నాహాలు
● నామినేషన్లకు ముందే
వైఎస్సార్సీపీ శ్రేణులను కంట్రోల్
చేయాలనే దిశగా ఎత్తుగడలు
సాక్షి ప్రతినిధి, కడప : అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు బరితెగించడానికి సిద్ధమయ్యారా? ప్రజల్లో విశ్వాసం కోల్పోయి అడ్డదారుల్లో అందలం ఎక్కాలని చూస్తున్నారా? నామినేషన్లకు ముందే పట్టణాల్లో,పల్లె సీమల్లో భయోత్పాతం సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నారా? అంటే.. అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రధానంగా పులివెందుల నుంచే దౌర్జన్యాలకు దిగాలను కుతంత్రాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు ప్రాంతాల నుంచి అల్లరి మూకలను దిగుమతి చేసుకుని పులివెందులలోని పలువురు టీడీపీ నేతల ఇళ్లల్లో తిష్ట వేయించినట్లు సమాచారం. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అరాచకం సృష్టించి లబ్ధి పొందినట్లుగానే మున్సిపల్ ఎలక్షన్ ఇదే పద్ధతి అనుసరించి తమకు అనుకూలంగా మార్చుకోవాలని అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కొందరు పోలీస్ అధికారులు వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకుల సెల్ టవర్ లోకేషన్ వివరాలను పచ్చ నేతలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం నాయకుల ఎత్తుగడలను పసిగట్టిన కొంతమంది నేతలు బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ పరిణామాన్ని కూడా రాజకీయంగా అనుకూలంగా మలుచుకునే దిశగా టీడీపీ నేతల చర్యలు ఉన్నాయి. ఇప్పటికే వేముల, వేంపల్లి, కదిరి ప్రాంతాలకు చెందిన అల్లరిమూకలను దిగుమతి చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
భయోత్పాతమే అసలు లక్యం...
ఎన్నికలు ఏవైనా సరే పులివెందులలో ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తే టీడీపీ గెలుపు అసంభవం. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి భయోత్పాతం సృష్టిస్తే, పోలింగ్ ఏకపక్షంగా నిర్వహించుకోవచ్చునే ఏకై క లక్ష్యంతో టీడీపీ నేతలు ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారు. నామినేషన్లకు ముందే ఎంచుకున్న కొంతమంది నేతలపై ప్రత్యక్ష దాడులు చేయాలని దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మొన్నటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వేల్పుల రాము, సైదాపురం సంటిలను టార్గెట్ చేసి దాడి చేసిన విధంగానే తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో కొంతమంది యాక్టివ్గా ఉన్న నాయకులపై ప్రత్యక్ష దాడికి వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. గత రెండు దశాబ్దాలుగా లేని విష సంస్కృతి క్రమం తప్పకుండా ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు.


