క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు
● చీని తోటల్లో ముమ్మరంగా
‘నవధాన్యాల’ అంతర సాగు
● ఎల్‌నినో కరువులోనూ
భూసార రక్షణ
● ఆకుకూరలు, పశుగ్రాసంతో
నిత్యం చేతినిండా లాభాలు
సింహాద్రిపురం ప్రాంతంలో సాగు చేసిన తీగకూరగాయల పంట
ముద్దనూరు ప్రాంతంలో చీనీతోటలో సాగుచేసిన బెండపంట
కడప అగ్రికల్చర్: తీవ్ర వర్షాభావం, ఎల్‌నినో ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడేందుకు కడప జిల్లా ప్రకృతి సేద్య విభాగం సరికొత్త సాగు పద్ధతులకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని చీని తోటల్లో అంతర పంటగా నవధాన్యాల సాగును ముమ్మరంగా ప్రోత్సహిస్తోంది. ఈ విధానం ద్వారా రైతులకు రోజువారీ అదనపు ఆదాయం లభించడంతో పాటు, పశుగ్రాస కొరతను సమర్థవంతంగా అధిగమించవచ్చు.
● నేలకు పచ్చని కవచం.. భూసార పరిరక్షణ
చీని తోటల్లోని వరుసల మధ్య నేలను ఖాళీగా ఉంచకుండా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, పశుగ్రాస పంటలను సాగు చేయడం వల్ల భూమిపై పచ్చని కవచం ఏర్పడుతుంది. ఇది నేలలో తేమను ఎక్కువ కాలం నిలిపి ఉంచడమే కాకుండా, భూమిపై అధిక ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తగ్గిస్తుంది. పంట ముగిసిన తర్వాత మిగిలే మొక్కల అవశేషాలు సేంద్రియ పదార్థంగా మారి భూసారాన్ని, నేల జీవక్రియలను అద్భుతంగా మెరుగుపరుస్తాయి.
● తేమ సంరక్షణ.. భూగర్భజలాల రీఛార్జ్
అస్థిర వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతల పరిస్థితుల్లో నవధాన్యాల సాగు ద్వారా నేలలో తేమను నిలుపుకోవడంతో పాటు వర్షపు నీరు నేలలోకి ఇంకేలా తోడ్పాటును అందిస్తుంది. దీంతో ఉపరితల నీటి ప్రవాహం, నేల కోత తగ్గి, అందుబాటులో ఉన్న వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు కాలక్రమేణా భూగర్భజలాల రీఛార్జ్‌కు దోహదపడుతుంది. ప్రస్తుతం నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల్లో దీర్ఘకాలిక పొడి వాతావరణం, నీటి ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేలపై పచ్చదనం కొనసాగించడం ద్వారా తేమను కాపాడటంతో పాటు అధిక ఉష్ణోగ్రతల నుంచి నేలకు రక్షణ కల్పించవచ్చు.
● రైతులకు రోజువారీ రాబడి..
పశుగ్రాస కొరతకు పరిష్కారం
నవధాన్య సాగులో భాగంగా కూరగాయలు, ఆకుకూరల పంటలను కూడా సాగు చేస్తున్నారు. ఫలితంగా రైతులకు కూరగాయలతో పాటు ఆకుకూరలతో నిత్యం ఆర్థిక రాబడి వస్తుంది. అలాగే పశుగ్రాసం కొరతను కూడా రైతులు అధిగమించే వీలుంటుంది. పశుమేత పశువులకు వేయడం వల్ల పాల దిగుబడి కూడా పెరిగి రైతులకు ఆర్థిక భరోసా లభిస్తుంది. నవధాన్యాల సాగులో భాగంగా సాగు చేసే పశుగ్రాస పంటలు పశువులకు అదనపు పచ్చి మేతను అందిస్తాయి. దీంతో పాడి పశువులకు పచ్చిమేత కొరత తీరుతుంది. దీంతోపాటు నేల కవచం, జీవపదార్థం, పశుగ్రాసం వంటి బహుళ ప్రయోజనాలు రైతులకు లభిస్తాయి.
● 300 ఎకరాల్లో సాగు ప్రారంభం
జిల్లావ్యాప్తంగా మొత్తం 21,776 హెక్టార్లలో చీని పంట సాగులో ఉంది. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది క్షేత్రస్థాయిలో కల్పించిన విస్తృత అవగాహనతో ఇప్పటివరకు జిల్లాలో 300 ఎకరాల చీని తోటల్లో నవధాన్యాల సాగు విజయవంతంగా ప్రారంభమైంది. రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని చీని తోటల్లో ఈ పద్ధతిని అమలు చేసేందుకు ప్రకృతి వ్యవసాయ శాఖ రైతులకు అవసరమైన సాంకేతిక సాయం, విత్తనాల లభ్యతపై అవగాహన కల్పిస్తూ సాగును ముమ్మరం చేస్తోంది.
నవధాన్య పంటల సాగు ప్రాధాన్యతపై మా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. విత్తనాల ఎంపిక, విత్తే విధానంతో పాటు నేలను ఖాళీగా ఉంచకుండా నిరంతరం పచ్చదనాన్ని కొనసాగించడం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరిస్తున్నాం. ఈ అవగాహనతో జిల్లాలోని పలువురు చీని రైతులు తమ తోటల్లో నవధాన్యాల సాగును చేపట్టేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. – ఎస్.వి. ప్రవీణ్‌కుమార్, ప్రకృతి సేద్యం జిల్లా ప్రాజెక్టు మేనేజర్


