రాజంపేట టౌన్: నైపుణ్యం పోర్టల్ ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులు సులువుగా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని జిల్లా ఉపాధికల్పనశాఖ అధికారి ఎస్.సురేష్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో నైపుణ్యం పోర్టల్‌పై శుక్రవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా సురేష్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు తరగతిగదిలో నేర్చుకున్న నైపుణ్యాలను ప్రపంచానికి అందించడం ప్రారంభిస్తే ఆయా రంగాల్లో అనేక సేవలు అందిస్తారని, తద్వారా డబ్బులను కూడా సంపాదించుకోవచ్చన్నారు. జిల్లా నైపుణ్య అభివృద్ది అఽధికారి విజయ్‌వినీల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ యువత భయం వీడినప్పుడే ఏ రంగంలో అయినా రాణించగలరని తెలిపారు. ఇదిలావుంటే ఇటీవల ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా ఉపాధికల్పన అధికారి చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈకార్యక్రమంలో ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ సి.రామ్మూర్తి, న్యాక్ ఏడీ రాకేష్, ప్రభుత్వ ఐటిఐ సూపరిండెంట్ ఆదిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ రాణి, ఏటీఓలు సుబ్బరాయుడు, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.
జమ్మలమడుగు: జిల్లాలో ఉత్తమ గ్రంథాలయ అధికారిగా నాదెండ్ల బాబ్జి ఎంపికయ్యారు. . శుక్రవారం జిల్లా గ్రంథాలయ చైర్మన్ భానుప్రకాశ్, కార్యదర్శి అమీరుద్దీన్‌లు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. బాబ్జిని పట్టణ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బండారు శ్రీనివాసులు అభినందించారు.అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ జమ్మలమడుగు గ్రంథాలయ అభివృద్ధికి బాబ్జి కృషి చేశారని తెలిపారు.
తొండూరు : దోమకాటువల్ల డెంగీ, మలేరియా, మెదడు వాపు వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి రామ విజయారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని మల్లేల గ్రామంలో డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది ఇంటింటా ఫీవర్, లార్వా సర్వేలు చేపట్టారు. నీటి నిల్వలను పరిశీలించి లార్వా నిర్మూలన కోసం యాంటీ లార్వాల ఆపరేషన్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దోమ కాటుకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ సిద్ధయ్య, సీహెచ్‌ఓ సోమేశ్వరి, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు సతీష్, అంజలి, జ్యోతి, సరళ, తదితరులు పాల్గొన్నారు.
పులివెందుల రూరల్ : తమను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని కడప రోడ్డులో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులకు హాజరై నల్ల బ్యాడ్జీలు ధరించి ఆసుపత్రి వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు శివప్రసాద్, సుజిత, వీణ, రుకియా, సుభాషిణి, శిరీషలు మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పులివెందులలో నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు 100% గ్రేస్ ఇవ్వాలన్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.


