ఆ తల్లిని ఓదార్చడం.. ఈతరం కాదు ! | - | Sakshi
Sakshi News home page

ఆ తల్లిని ఓదార్చడం.. ఈతరం కాదు !

Jun 6 2026 1:17 AM | Updated on Jun 6 2026 1:17 AM

ఈతకొట్టేందుకు నీటిలోకి దిగిన

నలుగురు పిల్లలు

ఇద్దరిని కాపాడిన తల్లి

కళ్ల ఎదుటే నీటిలో మునిగి

మరో ఇద్దరు మృతి

ఖాజీపేటలో హృదయవిదారక ఘటన

ఖాజీపేట : అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు నీటిలో మునిగిపోతుంటే వారిని కాపాడేందుకు ఆ తల్లి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టింది. నీటిలో దూకి ఇద్దరిని కాపాడింది. మరో ఇద్దరు తన కళ్లముందే నీటిలో మునిగిపోతుంటే వారిని కాపాడలేక గుండెలవిసేలా విలపించిన హృదయవిదారక ఘటన ఖాజీపేటలోని మండలం దుంపలగట్టు గ్రామంలోని గుట్టులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామం సమీపంలోని గుట్టుపై 10 ఏళ్లుగా పందులను మేపుతూ శివకృష్ణ, శ్రీవాణి దంపతులు జీవనం సాగిస్తున్నాయి. పందులను నీటి గుంటలో శుభ్రం చేసేందుకు ప్రతి రోజు శివకృష్ణ వెళ్లి వచ్చేవారు. శుక్రవారం శివకృష్ణ ఇతర పనులపై కడపకు వెళ్లారు. దీంతో శ్రీవాణి నీటిలో ఉన్న పందుల కంచె వద్దకు వెళ్లారు. ఆమెతో పాటు ఇద్దరు కుమారులు గౌతమ్‌, కార్తీక్‌తో పాటు వనం సంజన (18) వనం అర్చన (14) వెళ్లారు. శ్రీవాణి పందుల కంచె వద్ద ఉండగా నీటిలో ఈత కొడదాం అని పిల్లలు తల్లిని ఒత్తిడి చేశారు. దీంతో శ్రీవాణి అంగీకరించారు. నలుగురు పిల్లలు నీటిలోకి దిగారు. నీటిలోని కుంట లోతుగా ఉండటంతో నలుగురు నీటిలో మునిగిపోతుండగా శ్రీవాణి గుర్తించారు. వెంటనే అప్రమత్తమై గౌతమ్‌, కార్తీక్‌లను కాపాడి ఒడ్డుకు చేర్చారు. సంజన, అర్చన అప్పటికే నీటిలో మునిగిపోవడంతో వారిని కాపాడే ప్రయత్నం చేసేలోగానే ఇద్దరూ గల్లంతయ్యారు. గట్టిగా కేకలు వేడయంతో స్థానికులు అక్కడికి చేరుకుని పిల్లల కోసం నీటిలో గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో ఖాజీపేట సీఐ వంశీధర్‌కు స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే చెన్నూరు నుంచి గజ ఈతగాళ్లతో పాటు స్థానికులు కలిసి మృతదేహాలను గుర్తించే ప్రయత్నం చేశారు. చివరకు రోప్‌ సహాయంతో పిల్లల మృతదేహాలను వెలికి తీసి కడప రిమ్స్‌కు తరలించారు. శివకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లి కళ్లెదుటే మృత్యుఒడిలోకి..

శ్రీ వాణి కళ్ల ఎదుటే తన ఇద్దరు కుమార్తెలు మృత్యు ఒడిలోకి వెళ్లడంతో ఆ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. కాపడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని ఆమె రోదించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పరామర్శ

దుంపలగట్టు గ్రామంలో ఇద్దరు చిన్నారులు నీట మునిగిన విషయం తెలియగానే వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అక్కడికి చేరుకున్నారు. జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

ప్రమాదం నుంచి బయట పడిన కార్తీక్‌, గౌతమ్‌

Advertisement
 
Advertisement
Advertisement