టీడీపీలో అసమ్మతి సెగలు | - | Sakshi
Sakshi News home page

టీడీపీలో అసమ్మతి సెగలు

Jun 6 2026 1:17 AM | Updated on Jun 6 2026 1:17 AM

కాశినాయన : బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు తారా స్థాయికి చేరాయి. టీడీపీలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న కార్యకర్తలను పక్కన పెట్టడాన్ని ఆ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. శుక్రవారం మండలంలోని అశోక్‌కుమార్‌రెడ్డి పాఠశాల ఆవరణలో టీడీపీ అసమ్మతి నాయకులు ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పార్టీ అధికారంలో లేకపోయినా 30 ఏళ్లుగా నమ్ముకుని ఉన్న కార్యకర్తలను కొంత మంది నాయకులు విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన మహానాడుకు నాయకులను, కార్యకర్తలను పిలవకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. పార్టీ అధికారంలో లేకపోయినా గ్రామాలు, మండల, బూత్‌ స్థాయిలో జెండాను మోస్తూ.. బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేశామన్నారు. మహానాడు నిర్వహణ, బూత్‌ కమిటీ ఏజెన్సీలను ఏకపక్షంగా నిర్వహించడం ఎంత వరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రితీష్‌ నాయకత్వంలో మండలంలో టీడీపీలోనే రెండు వర్గాలుగా ఏర్పడ్డాయి. ఇది ఇలా ఉండగానే అధిష్టానం డీసీసీబీ చైర్మన్‌ సూర్యనారాయణరెడ్డికి మహానాడు నిర్వహణ, బీఎల్‌ఏల నిర్వాహణ బాధ్యతలను అప్పగించింది. గ్రామాల్లో కార్యకర్తలకు తెలపకుండా బీఎల్‌ఏలను నియమించుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు మండలంలో రితీష్‌ నాయకత్వంలోని రెండు వర్గాలు ఏకమై మన భవిష్యత్తు ఏమిటని సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర అధినాయకుల దృష్టికి తీసుకెళుతామని వారు తెలిపారు. గ్రామ కమిటీలు, మండల నాయకత్వం, క్లస్టర్‌ ఇన్‌చార్జిలకు సమాచారం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని వారు అభిప్రాయపడ్డారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న వారిని పక్కన పెట్టడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నముక అని పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేష్‌ పలు మార్లు పేర్కొన్నారని వారు గుర్తు చేశారు. కార్యకర్తలను విస్మరిస్తే పార్టీకి భవిష్యత్తు ఉండదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, మండల సింగిల్‌ విండో అధ్యక్షుడు గురివిరెడ్డి, మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ డి.రవీంద్రారెడ్డి, టీడీపీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సూర్యనారాయణరెడ్డికి వ్యతిరేకంగా

టీడీపీ నాయకుల సమావేశం

పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు

గుర్తింపు ఇదేనా?

అసహనం వ్యక్తం చేస్తున్న నాయకులు

Advertisement
 
Advertisement
Advertisement