రెగ్యులర్‌ కోసం ఎదురుచూపు | - | Sakshi
Sakshi News home page

రెగ్యులర్‌ కోసం ఎదురుచూపు

May 16 2026 1:27 AM | Updated on May 16 2026 1:27 AM

కడప రూరల్‌: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఎంపీహెచ్‌ఏ ( మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ )గా విధులు చేపట్టాలంటే ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా శిక్షణ పొందాలి. మొదట్లో ఈ శిక్షణలను కేవలం ప్రభుత్వ పరిధిలోని ట్రైనింగ్‌ కేంద్రాల్లో మాత్రమే 18 నెలలపాటు శిక్షణ ఇచ్చేవారు. తర్వాత కాలంలో పలు ప్రైవేటు సంస్థలు కూడా శిక్షణ ఇచ్చాయి. కాగా 2002–2003వ సంవత్సరంలో డీఎస్సీ ద్వారా కాంట్రాక్ట్‌ ఎంపీహెచ్‌ఏ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్‌ శిక్షణ సంస్థల్లో ట్రైనింగ్‌ పొందిన వారు కూడా కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఉద్యోగాలు పొందారు.

2024లో ఎన్నికల కోడ్‌ కారణంగా..

2024వ సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేశారు. ఆ ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 89 మంది కాంట్రాక్ట్‌ ఎంపీహెచ్‌ఏ ఉద్యోగులు రెగ్యులర్‌ అయ్యారు. మరో 32 మందికి రెగ్యులర్‌ కావాల్సి ఉండగా అంతలోపే ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తమను కూడా రెగ్యులర్‌ చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. అలాగే న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు.

ఆదుకోవాలి

ఈ ఉద్యోగాన్నే నమ్ము కుని జీవిస్తున్నాం. 2003వ సంవత్సరం నుంచి విధులు చేపడుతున్నాం. మా ఉద్యోగాలను రెగ్యులర్‌ చేసి ఆదుకోవాలి.

– డి శివరాం, పీహెచ్‌సీ ఆకేపాడు

న్యాయం చేయండి

నేను 2003 నుంచి విధుల్లో ఉన్నా. మా ఉద్యోగాలను రెగ్యులర్‌ చేయాలి. వాస్తవాలను పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేయాలి.

–ఎం చాంద్‌ బాషా, పీహెచ్‌సీ, వనిపెంట

అర్హులకు న్యాయం చేయండి

ఈ శాఖను నమ్ముకుని ఏళ్ల తరబడి విధులు చేపడుతున్నాం. మా సహచర ఉద్యోగులకు చాలామందికి రెగ్యులర్‌ అయింది. మేము అన్ని విధాల అర్హులం. మా ఉద్యోగాలను రెగ్యులర్‌ చేసి ఆదుకోవాలి. – జి నరసయ్య, కాంట్రాక్ట్‌ ఎంపీహెచ్‌ఏ, పీహెచ్‌సీ, చెన్నూరు

ఇతని పేరు వీఎన్‌ ముని రెడ్డి. చెన్నూరు ప్రాథమి క ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్‌ ఎంపీహెచ్‌ఏగా పని చేస్తున్నారు. నిబంధనల ప్రకారం తిరుపతి ఎస్వీ మెడికల్‌ కాలేజీ ప్రభుత్వ శిక్షణా కేంద్రంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా శిక్షణ పొందారు. 2006 నుంచి కాంట్రాక్ట్‌ ఎంపీహెచ్‌ఏగా విధులు చేపడుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగిగా 2027 ఏప్రిల్‌ 30వ తేదీన రిటైర్మెంట్‌ అవుతారు. అదే రెగ్యులర్‌ అయితే 2029 ఏప్రిల్‌ 30న ఉద్యోగ విరమణ చెందుతారు. తనలాంటి వారికి చాలా మందికి ఉద్యోగాలు రెగ్యులర్‌ అయ్యాయి. అన్ని అర్హతలు ఉండి తామెందుకు రెగ్యులర్‌ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్‌ కోసం పలువురు ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.

కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న ఎంపీహెచ్‌ఏలు

రెగ్యులర్‌ చేసిఆదుకోవాలని వేడుకోలు

Advertisement
 
Advertisement
Advertisement