సర్‌ షెడ్యూల్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

సర్‌ షెడ్యూల్‌ విడుదల

May 16 2026 1:27 AM | Updated on May 16 2026 1:27 AM

కడప సెవెన్‌రోడ్స్‌: ఫొటో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌/సర్‌)–2026 కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. 2026 జులై 1 అర్హత తేదీగా నిర్ణయించారు. ఆ తేది నాటికి వయస్సు 18 సంవత్సరాలు నిండే వారంతా ఓటర్ల జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవడానికి అర్హులు. సెన్సెస్‌ మొదటి దశలో ఇళ్ల జాబితా, ఇళ్ల గణన కార్యక్రమం ఈనెల 20వ తేది నాటికి పూర్తి కానుంది. జిల్లాలో ఎన్యుమరేటర్లుగా పనిచేస్తున్న 3529 మందిని ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సైతం వినియోగించనున్నారు. అధికారులు, సిబ్బందికి జూన్‌ 5 నుంచి 14వ తేది వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బూత్‌ లెవెల్‌ అధికారులు జూన్‌ 15 నుంచి జులై 14వ తేది వరకు ఇంటింటి పరిశీలన నిర్వహిస్తారు. అందుబాటులో లేని వారు, ఇతర ప్రాంతాలకు షిఫ్ట్‌ అయిన వారు, మరణించిన వారు, డూప్లికేట్‌ ఓటర్లను గుర్తిస్తా రు. చుట్టుపక్కల ఉన్న ఓటర్ల ద్వారా బీఎల్‌ఓలు ఈ సమాచారాన్ని సేకరిస్తారు. ముసాయిదా జాబితాలో చేర్చబడని వీరి పేర్లను ప్రజలు తెలుసుకోవడానికి వీలుగా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద నోటీసు బోర్డులో ప్రదర్శిస్తారు. ఎన్యూమరేషన్‌ సమయంలో ఓటర్ల నుంచి ఎలాంటి పత్రాలను సేకరించరు. ఎవరైనా తన పేరును లేదా తమ బంధువుల పేర్లను గత ఇంటెన్సివ్‌ రివిజన్‌లో ఉన్న ప్రకారం ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవచ్చు. గత ఓటర్ల జాబితాలో పేర్లు నమోదై ఉండి ప్రస్తుత ఎన్యుమరేషన్‌ సమయంలో కనిపించని వ్యక్తులకు ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి ముసాయిదా జాబితా విడుదల తర్వాత నోటీసులు జారీ చేస్తారు. అలా ఎవరికై తే నోటీసులు జారీ చేయబడతాయో వారి జాబితాలు ఈఆర్‌ఓ రికార్డు నిర్వహిస్తారు. ఇంటింటి సర్వే సమయంలో ప్రతి బీఎల్‌ఓ వద్ద కనీసం 30 ఫారం–6లు అందుబాటులో ఉంటాయి. ఓటర్లుగా నమోదు కావాలనుకునే వారికి బీఎల్‌ఓలు ఫారం–6ను అందజేస్తారు.

హెల్ప్‌లైన్‌ నెంబరు 1950 ఏర్పాటు

అర్హులైన వారు ప్రత్యేకించి దివ్యాంగులు, వలస వచ్చిన వారు, వృద్దులు, ఓటర్లు తమ పేర్లను జాబితాల్లో నమోదు చేసుకోవడానికి వీలుగా జిల్లా స్థాయి లో 1950 హెల్ప్‌లైన్‌ నెంబరును అందుబాటులోకి తీసుకు రానున్నారు. జిల్లాలో ప్రస్తుతం 2251 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. జులై 14నాటికి పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారు. జులై 21న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. అదే రోజు నుంచి ప్రారంభించి ఆగస్టు 20వ తేది వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలను సెప్టెంబరు 18 నాటికి పరిష్కరించి అదేనెల 22వ తేది ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు.

జూన్‌ 5 నుంచి 14 వరకుసిబ్బందికి శిక్షణ

జూన్‌ 15 నుంచి జులై 14 వరకు బీఎల్‌ఓల ఇంటింటి సర్వే

Advertisement
 
Advertisement
Advertisement