పసిమొగ్గకు రూ.16 కోట్ల కష్టం
కడప సెవెన్‌రోడ్స్ : పసిమొగ్గకు ఒక్కసారిగా రూ. 16 కోట్ల కష్టం వచ్చి పడింది. నెలల చిన్నారి రెండేళ్లకు మించి బ్రతకని రుగ్మత ఎదుర్కొంటోంది. పాప బ్రతకాలంటే రూ. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ కావాలి. కర్నూలుజిల్లా వెల్దుర్తి పట్టణానికి చెందిన జేఎం సురేష్, పుష్పావతిల కుమార్తె పునర్వికశ్రీ ఈ అరుదైన జబ్బును ఎదుర్కొంటోంది. శరీరాన్ని కదపలేని స్థితిలో ఉంది. ఏడవాలన్నా, నవ్వాలన్నా, చివరికి ఊపిరి తీసుకోవాలన్నా కష్టపడాల్సి వస్తోంది. హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు చేయించగా, ఎస్‌ఎంఏ టైప్–1 (స్పైనల్ మస్క్యులర్ ఆత్రఫీ–జన్యు సంబంధిత వెన్నముక కండరాల క్షీణత) అని నిర్ధారణ అయింది. ఈ వ్యాధి నుంచి చిన్నారి ప్రాణాలతో బయటపడాలంటే రూ. 16 కోట్లు విలువజేసే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు తెలుపడంతో ఆ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. వెల్దుర్తి కొత్త బస్టాండు ప్రాంతంలో ఓ చిన్నషాపులో క్షురకునిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న సురేష్ ఏం చేయాలో తోచక తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఈ పరిస్థితుల్లో కడపకు చెందిన కొంతమంది యువకులు బ్యానర్ ధరించి సోమవారం కలెక్టరేట్ ఎదుట నిలబడి చిన్నారికి సాయం చేయాలంటూ అర్థించారు. దీంతో పలువురు తమ తోచిన రీతిలో సాయం అందించారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి పెద్ద మొత్తంలో సాయం చేయదలుచుకుంటే 86889 12326 నెంబరులో సంప్రదించాలని కోరారు.


