కుమారుడు ఇల్లు రాయించుకుని గెంటేశాడు
ప్రొద్దుటూరు : కడుపులో పుట్టిన తన రెండో కుమారుడు శ్రీనివాసులు తన ఇంటిని దొంగగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇంటి నుంచి గెంటేశాడని మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన కొట్టే పాలకొండ్రాయుడు తెలిపారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ సాయిశ్రీ అధ్యక్షతన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన మాటాల్లోనే.. తమకు వెంకటరమణ, విజయలక్ష్మి, శ్రీనివాసులు అనే ముగ్గురు పిల్లలు ఉన్నారన్నారు. తనతోపాటు సతీమణి వీరనారాయణమ్మ కూలి పనులకు వెళ్లి 18 ఏళ్ల క్రితం ఐదున్నర సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి ఇల్లు నిర్మించామన్నారు. ఈ ఇళ్లలో వెంకటరమణ, శ్రీనివాసులు నివాసం ఉంటున్నారని తెలిపారు. రెండేళ్ల క్రితం తనకు తెలియకుండా శ్రీనివాసులు తాను ఇంటి రిజిస్ట్రేషన్ చేయించుకుని తర్వాత ఆయన సతీమణి జ్యోతి ఈశ్వరమ్మ పేరుతో మార్పించారన్నారు. ఈ ఆస్తి తన పిత్రార్జితం కాదని, తాను కష్టించి కొనుగోలు చేసినదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉండటానికి ఇల్లు లేకపోవడంతో మైదుకూరులోని తాను చిన్నప్పుడు పెంచి పోషించిన తన బంధువుల కుమారుడు సాయి ఇంటిలో దంపతులిద్దరం తలదాచుకుంటున్నట్టు తెలిపారు. వృద్ధులమైన దంపతులిద్దరం జబ్బులతో బాధపడుతున్నట్లు ఆర్డీఓకు వివరించారు.
● కొత్తపల్లె గ్రామంలో కాలువను ఆక్రమించి ప్లాట్లు వేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆర్డీఓకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అధికారులు కాలయాపన చేయడం తగదన్నారు.
● అమృతానగర్ ఇళ్లకు ఇంటి పన్ను వేయాలని న్యాయవాది బండి రవికుమార్ ఫిర్యాదు చేవారు. ఇంటి పన్ను వేయడం వల్ల ప్రభుత్వం ఇచ్చిన ఇంటిపై లబ్ధిదారులకు హక్కు ఏర్పడుతుందన్నారు. అమృతానగర్ నుంచి నిర్మించి 17 ఏళ్లు అయినా ఇంత వరకు పన్ను వేయలేదన్నారు. పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ సూర్యనారాయణరెడ్డిని ఆర్డీఓ ఆదేశించారు.
ఆర్డీఓ సాయిశ్రీ మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ 28న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. భూ వివాదాలతోపాటు ఇతర సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో భూ సమస్యలు ప్రధానంగా జేసీ పరిధిలో ఉండేవని, ఇప్పుడు ఆర్డీఓ పరిధికి మార్చారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సూర్యనారాయణరెడ్డి, తహసీల్దార్ వి.గంగయ్య, డిప్యూటీ తహసీల్దార్‌లు సుదర్శన్, అజయ్‌బాబు, ఆర్‌ఐ నాగమోహన్‌రెడ్డి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
రెవెన్యూ క్లినిక్‌లో వృద్ధుడు ఫిర్యాదు


