నేటి గ్రీవెన్స్‌సెల్ రద్దు
కడప సెవెన్ రోడ్స్: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గ్రీవెన్స్‌సెల్ రద్దు చేసినట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నిర్వహించే వర్చువల్ సమావేశానికి కలెక్టర్, ఎస్పీ, సహా జిల్లా అధికారులు పాల్గొననున్న నేపథ్యంలో గ్రీవెన్స్ సెల్ రద్దు చేశామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.
కడప కోటిరెడ్డి సర్కిల్: మహా శివరాత్రి పండుగ నేపథ్యంలో కడప పాత బస్టాండ్ నుంచి సోమ వారం పొలతలకు ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు కడప డిపో మేనేజర్ కన్యాకుమారి తెలిపారు. కడప పాత బస్టాండ్ నుంచి ఉదయం 6.30, 9.00 గంటలకు, 11.30, 2.15, 4.45 గంటలకు ఈ ప్రత్యేక బస్సులు బయల్దేరుతాయ న్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆమె కోరారు.
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్‌కు సంబంధించిన జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం 80 పరీక్షా కేంద్రాల్లో ఉదయం, సాయంత్రం జరిగిన పరీక్షలకు 92 మంది గైర్హాజరయ్యారు. ప్రాక్టికల్ పరీక్షల తనిఖీలో భాగంగా ఆర్‌ఐవో టీఎన్‌వీ వెంకటేశ్వర్లు, రెండు ప్లయింగ్ స్వ్కాడ్ బృందాలతోపాటు డీఈసీ సభ్యులు కలిసి జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఎగ్జామినర్స్‌కు పలు సూచనలు, సలహాలను ఇచ్చారు.
కడప కోటిరెడ్డి సర్కిల్: ఎంప్లాయీస్ యూనియన్ కడప జోన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. జోనల్ అధ్యక్షుడుగా పీఎస్ ఖాన్ (అనంతపురం డిపో), జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సి.మధు(చిత్తూరు–1 డిపో), వైస్ ప్రెసిడెంట్‌గా రామాంజనేయులు (కడప జోనల్ వర్క్‌షాప్), జోనల్ కార్యదర్శిగా ఎన్.రాజశేఖర్(డిపోటీఓ కార్యాలయం, కడప), కోశాధికారిగా పీఎన్‌పీ రెడ్డి (ప్రొద్దుటూరు డిపో), పబ్లిసిటీ సెక్రటరీగా ఓబుళరత్నం (అనంతపురం డిపో), మరో 20 మందిని ఉపాధ్యక్షులుగా, జాయింట్, ఆర్గనైజింగ్, అసిస్టెంట్ సెక్రటరీలుగా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటి వరకు కడప జోనల్ అధ్యక్షులుగా కొనసాగిన కె.కృష్ణకుమార్‌ను, అన్నమ్య జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్న నాగభూషణం రెడ్డిలను రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారని జోనల్ అధ్యక్షుడు కేకే కుమార్ తెలిపారు.
మదనపల్లె: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు డయల్ యువర్ ఎపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు.
రాజుపాళెం: ప్రమాదాన్ని పసిగట్టి డ్రైవర్ బస్సును ముందే ఆపిన సంఘటన రాజుపాళెం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. రోజూ మాదిరిగా ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపో నుంచి వయా రాజుపాళెం మీదుగా టంగుటూరు నుంచి చాగలమర్రి మండలంలోని చింతలచెరువు గ్రామానికి బస్సు వెళ్లాల్సి ఉంది. అయితే రోజూ వెళ్లే ఆర్టీసీ బస్సు మరమ్మతుల కారణంగా ఆదివారం డిపో సిబ్బంది వేరే బస్సును పంపించారు. ప్రొద్దుటూరులోని పాతబస్టాండు నుంచి మధ్యాహ్నం ప్రయాణికులను ఎక్కించుకున్న డ్రైవరు రాజుపాళెం గ్రామ సమీపంలోని కేసీ చాపాడు కాలువ దాటగానే టక్ అని శబ్ధం రావడంతో.. ఈ విషయాన్ని చాకచక్యంగా గమనించారు. బస్సులో ఉన్న ప్రయాణికులందరికీ ‘మీరంతా ధైర్యంగా ఉండండి’ అని చెప్పి కొద్దిసేపటికి బస్సును నిలబెట్టాడు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే డీజిల్ ట్యాంకుకు రంధ్రం పడటంతో కొద్దిమేర డీజిల్ నష్టమైందని ప్రయాణికులు తెలిపారు. ఇందులో డ్రైవర్ తెలివి తేటలకు 30 మంది ప్రాణాలు నిలబడ్డాయని, అక్కడున్న వారంతా ‘సలాం... డ్రైవరన్న’ అంటూ సెల్యూట్ చేయడం విశేషం. అయితే క్షేమంగా గమ్యం చేరాలంటే కండిషన్‌లో ఉన్న బస్సులను తిప్పాలని ప్రయాణికులు కోరుతున్నారు.


