బాబు పాలనలో ఆలయాలకు రక్షణ కరువు
ప్రొద్దుటూరు క్రైం : చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో హిందువుల ఆలయాలకు భద్రత లేదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. ప్రొద్దుటూరులోని ఎర్రగుంట్ల రోడ్డులో రెండు రోజుల క్రితం ఆటవీ శాఖ అధికారులు కూల్చిన వారాహి మాత ఆలయానికి శనివారం రాచమల్లు వెళ్లి అక్కడ కూల్చిన కట్టడాలు, ధ్వంసమైన నవగ్రహ విగ్రహాలను పరిశీలించారు. ఆలయ సమీపంలో చుట్టుపక్కల టీడీపీ కౌన్సిలర్, ఇతర నాయకులు నిర్మించుకున్న ఫామ్ హౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లు, భారీ విలాసవంతమైన భవనాలు చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం వారాహి మాత ఆలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫారెస్ట్ భూమిలో ఉందంటూ రాత్రి సమయాల్లో అటవీ అధికారులు వచ్చి ఆలయంలోని కట్టడాలను కూల్చడం దారుణమన్నారు. ఒక రోజు ఆగండి.. మండపాన్ని కూల్చొద్దంటూ పేద బ్రాహ్మణుడైన పూజారి కాళ్లు పట్టుకుంటానన్నా అధికారులు కనికరించలేదని తెలిపారు. జేసీబీతో కొత్తగా నిర్మాణం చేస్తున్న మండపాన్ని కూల్చారన్నారు. ఈ క్రమంలోనే నవగ్రహ మండపంపై రాళ్లు పడటంతో ఆ విగ్రహాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని తెలిపారు. దీన్నిబట్టి చూస్తేనే చంద్రబాబు పాలనలో ఆలయాలకు ఉన్న భద్రత ఏ పాటిదో తెలుస్తోందని అన్నారు.
టీడీపీ నాయకుల గెస్ట్‌హౌస్‌లు కనిపించలేదా?
వారాహి మాత ఆలయంతోపాటు పరిసర ప్రాంతమంతా ఏటిపోరంబోకు, అటవీ భూమలు ఉన్నాయని రాచమల్లు అన్నారు. అయితే ఇందులో నిరుపయోగంగా ఉన్న 20–30 సెంట్ల స్థలంలో ప్రజల కోసం వారాహి అమ్మవారి ఆలయం నిర్మిస్తే అటవీ స్థలాన్ని ఆక్రమించారంటూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం కూల్చినట్లు తెలిపారు. ఆలయం చుట్టూ టీడీపీ కౌన్సిలర్, నాయకులు రూ.కోట్లు వెచ్చించి ఫాం హౌస్‌లు, విలాస భవంతులు నిర్మించారన్నారు. వాటిలో స్విమ్మింగ్ పూల్‌ను ఏర్పాటు చేసి రోజు వారి రూ. 5 వేలకు బాడుగకు ఇస్తున్నారని చెప్పారు. మందు పార్టీలు, విందులు, వ్యభిచారం, వినోదాలతో అర్ధరాత్రి సమయాల్లో కేరింతలు వేస్తుండటంతో ఆ ప్రాంత మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురౌతున్నారని తెలిపారు. రాచమల్లు అక్కడున్న సమయంలోనే ఆ ప్రాంత మహిళలు వచ్చి ఇబ్బంది పడుతున్నట్లు వాపోయారు. గెస్ట్‌హౌస్ నిర్మించుకొని ఒక వ్యక్తి ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నాడన్నారు. ఇదంతా చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి కనపడలేదా.. వారాహి ఆలయమే కనిపించిందా అని ప్రశ్నించారు. తన వాహనానికి వారాహి అని పేరు పెట్టుకున్న పవన్‌కల్యాణ్ ఇక్కడ వారాహి అమ్మవారి ఆలయాన్ని తన శాఖ అధికారులే కూలుస్తుంటే నిద్రపోతున్నాడా అని ప్రశ్నించారు. ఆలయాలను కూల్చి టీడీపీ నాయకులు ఆక్రమించిన భూములకు ఈ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందా అని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలను ప్రభుత్వం గౌరవించాలన్నారు. భవిష్యత్తులో వారాహి అమ్మవారి ఆలయానికి ఆటంకం కలిగించరాదని అన్నారు.
నూతన మండప నిర్మాణానికి సహకారం
అటవీ అధికారులు కూల్చిన స్థానంలో ప్రత్యంగిరాదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కోసం నిర్మించనున్న మండపానికయ్యే పూర్తి ఖర్చును తాను భరిస్తానని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఆలయ నిర్వాహకుడు రవిశాస్త్రి తెలిపారు. ఈ మొత్తాన్ని తానే ఇస్తానని నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలని రాచమల్లు అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, మండలాధ్యక్షుడు సానబోయిన శేఖర్‌యాదవ్, పార్టీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వారాహి మాత ఆలయంలో
మండపం, విగ్రహాలు ధ్వంసం చేశారు
పేద బ్రాహ్మణుడు వేడుకున్నా
అటవీ అధికారులు కనికరించలేదు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి


