మెరుగు పేరుతో బంగారం అపహరణ
సింహాద్రిపురం : రాగి, ఇత్తడి సామాన్లకు మెరుగుపెడతామంటూ.. మహిళ మెడలోని బంగారును లాక్కెళ్లిన సంఘటన సింహాద్రిపురంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో పూజారిగా పని చేస్తున్న శ్రీనివాసుల ఆచారి భార్య పద్మాలయ రంగనాయకమ్మ తన ఇంట్లో పని చేసుకుంటుండగా, ఇద్దరు వ్యక్తులు బైకుపై వచ్చి రాగి, ఇత్తడి సామాన్లకు మెరుగుపెడతామని చెప్పారు. రంగనాయకమ్మ రాగి చెంబు తెచ్చి ఇచ్చింది. దానికి మెరుగు పెట్టే పౌడర్ మా వద్ద ఉందని, ఇది తీసుకుని మీరే మెరుగు పెట్టుకోవచ్చునని నమ్మించారు. ఆమె వచ్చి ఆ పౌడర్ తీసుకునే లోపు మెడలోని బంగారు గొలుసు లాక్కొని బైకుపై పరారయ్యారు. బాధితులు వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐ అనిల్‌కుమార్‌కు తెలిపారు. సంఘటన స్థలానికి డీఎస్పీ మురళీ నాయ క్, సీఐ, ఎస్‌ఐలు చేరుకుని పరిశీలించి, బాధితులతో మాట్లాడారు. పులివెందుల, తొండూరు, లింగాల, కొండాపురం పోలీస్‌స్టేషన్లను అలెర్ట్ చేసి సీసీ ఫుటేజీలను సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ అనిల్‌కుమార్ మాట్లాడుతూ ప్రజలు కొత్త వ్యక్తులు వస్తే అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాలలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నా వెంటనే పోలీసులకు తెలపాలన్నారు.


