అర్ధరాత్రి ఇల్లు కూల్చివేత దారుణం
– బద్వేలు శాసన సభ్యురాలు డాక్టర్ దాసరి సుధ
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : భారత రాజ్యాంగ దినోత్సవం జనవరి 26న అర్ధరాత్రి మాజీ సైనిక దళిత కుటుంబానికి చెందిన ఇంటిని కూల్చివేయడం దారుణమని బద్వేలు శాసనసభ్యురాలు దాసరి సుధ అన్నారు. ఇల్లు కూల్చివేత ఘటనా స్థలం వద్ద బాధిత కుటుంబ సభ్యులు చేపట్టిన రిలే నిరాహార దీక్షల ప్రారంభంలో శనివారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత మాజీ సైనికుడు సట్టి నరసింహులు కుటుంబానికి భారత రాజ్యాంగ దినోత్సవం అర్ధరాత్రి కాళరాత్రిగా మారడం దురదృష్టకరమన్నారు. కడప కలెక్టర్ బంగ్లాకు కుతవేటు దూరంలో ఎర్రముక్కపల్లె కందిపాలెం వద్ద, కలెక్టరేట్ మెయిన్ రోడ్డు ఆనుకొని ఉన్న ఇంటిని బుల్డోజర్లతో నేలమట్టం చేసిన ఘటన తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఇంత జరిగినా ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం సరికాదన్నారు. ఈ దౌర్జన్యకాండకు కారకులైన అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసులో కుటుంబానికి ప్రభుత్వం వెంటనే పూర్తి పరిహారం ఇవ్వాలన్నారు. ఎస్సీ ఎస్టీ కేసులను, వారికిచ్చే పరిహారాలను ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగేంత వరకు ఎమ్మెల్యేగా, మహిళగా అండగా అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.
కారులో చెలరేగిన మంటలు
బద్వేలు అర్బన్ : బద్వేలు– మైదుకూరు రహదారిలోని నందిపల్లె సమీపంలో ఓ కారులో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. ఇందుకు సంబంధించి అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గోపవరం మండలం చెన్నవరం గ్రామానికి చెందిన ప్రతాప్‌రెడ్డి తన టీఎస్07 జేఏ 4799 నంబరు గల కారును మరమ్మతుల నిమిత్తం ట్రాలీ వాహనానికి కట్టి తీసుకెళుతుండగా.. నందిపల్లె సమీపంలోని దొడ్ల డెయిరీ వద్దకు వచ్చేసరికి కారులో మంటలు చెలరేగాయి. వెంటనే ట్రాలీ డ్రైవర్ అప్రమత్తమై కారును రోడ్డు పక్కన నిలిపి ట్రాలీని పక్కకు తప్పించాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వగా ఫైర్ ఆఫీసర్ చంద్రుడు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కారులో బ్యాటరీ సామగ్రి రాపిడి వల్ల అగ్నిప్రమాదంలో చోటు చేసుకుందని, దాదాపు రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.
అర్ధరాత్రి ఇల్లు కూల్చివేత దారుణం


