శ్రీ చక్ర శుభ నివాసా!
నేడు పుష్పయాగం
వైభవంగా చక్రస్నానం... ధ్వజావరోహణం
కడప సెవెన్‌రోడ్స్: దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు మంగళవారం వసంతోత్సవం, అనంతరం చక్రస్నానం నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామి, అమ్మవార్లకు అవభృథ స్నానం, సుదర్శన చక్ర తాళ్వార్‌కు తీర్థస్నానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం నుంచి మేళతాళాలతో ప్రత్యేక పల్లకీలో స్వామి, అమ్మవార్లతోపాటు శ్రీ చక్రాన్ని ఊరేగింపుగా పుష్కరిణి మండపానికి చేర్చారు. అక్కడ వేద మంత్రయుక్తంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతంతోపాటు ఇతర ద్రవ్యాలతో కూడా అభిషేకించారు. తొలుత చందన లేపనం, నారికేళ జలాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుల బృందం ప్రత్యేకంగా అభిషేకం చేశారు. ఒట్టివేర్లతో ప్రత్యేకంగా దండలను స్వామి, అమ్మవార్లకు అలంకరించడం విశేషం. అనంతరం ఉత్సవమూర్తులను చక్ర తాళ్వార్‌తోపాటు పుష్కరిణిలోకి తీసుకెళ్లారు. గోవిందనామ స్మరణలు, భక్తుల కోలాహలం మధ్య మూలమూర్తులతోసహా అర్చకులు పుష్కరిణిలో మూడు మునకలు వేశారు. భక్తులు తాము కూడా పుష్కరిణిలో మునకలు వేసి పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను అలంకరించి ఊరేగింపుగా ఆలయానికి చేర్చారు. రాత్రి హంస వాహనంపై నుంచి స్వామి వారి భక్తులను కటాక్షించారు. అనంతరం వేద మంత్రోచ్ఛాటనల మధ్య ఆలయ ప్రాంగణంలో గరుడ పతాకాన్ని ధ్వజావరోహణం చేశారు. చివరగా మహా పూర్ణాహుతి, మహాకుంభ ప్రోక్షణం, ఆచార్య సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు.
బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా బుధవారం స్వామి, అమ్మవార్లకు పుష్పయాగం నిర్వహించనున్నారు.
శ్రీ చక్ర శుభ నివాసా!


