కేంద్ర కారాగారం పరిశీలన
కడప అర్బన్ : కడప కేంద్ర కారాగారం, ప్రత్యేక మహిళా కారాగారాన్ని జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి, ఫ్యామిలీ కోర్టు జడ్జి ఎన్.శాంత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబా ఫకృద్దీన్ ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఖైదీలతో మాట్లాడి కేసు వివరాలు, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు, అనంతరం జైలు పరిసరాలను పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రాధాన్యతను తెలియజేశారు. లీగల్ ఎయిడ్ బాక్సులను పరిశీలించారు. జైలు లోపల ఖైదీల హక్కులు, ఉచిత న్యాయ సాయం, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం, మానసిక వ్యాధులతో బాధపడే ఖైదీల ఆరోగ్య విషయాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సకాలంలో మందులను వాడాలని తెలియజేశారు. వైద్యాధికారికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నంబర్ 15100 పై ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో పురుషుల, ప్రత్యేక మహిళ కారాగారాల సూపరింటెండెంట్‌లు, బోర్డు అఫ్ విజిటర్స్ మెంబెర్స్, ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటరీలు, ఖైదీలు పాల్గొన్నారు.
మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు శిక్షణ
రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ, మీడియేషన్ కన్సిలేషన్ ప్రాజెక్టు కమిటీ ఆదేశానుసారంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్.బాబా ఫకృద్దీన్ కడపలోని న్యాయ సేవా సదన్‌లో ‘మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు 40 గంటల శిక్షణ’ అనే అంశంపై ప్రారంభ సెషన్ కార్యక్రమం న్యాయవాదులతో నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం అనేది ఒక ప్రక్రియ అని, వివాదాలను పరిష్కరిస్తున్న మంచి పద్ధతి, ఇది ఖర్చు, సమయాన్ని ఆదా చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు జడ్జి ఎన్.శాంతి, ఫోర్త్ ఆడిషినల్ డిస్టిక్ జడ్జి జి.దీనబాబు, 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి.రమేష్ కుమార్, పోక్సో కోర్ట్ జడ్జి ఎస్.ప్రవీణ్‌కుమార్, పిఎస్‌సిజె కోర్టు జడ్జి కె.ప్రత్యూష కుమారి, ఏఎస్‌జె కోర్టు జడ్జి జిసి ఆసిఫా సుల్తానా, మాస్టర్ ట్రైనర్స్ ఎస్‌హెచ్ సురేందర్ సింగ్, మిస్ మీనా కారే, న్యాయవాదులు పాల్గొన్నారు.
హిట్ అండ్ రన్ కేసుల్లో పరిహారం చెల్లింపు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని ఆదేశాల మేరకు సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్.బాబా ఫకృద్దీన్ ఆధ్వర్యంలో.. కడప కోర్టు ఆవరణలో గల న్యాయ సేవా సదన్‌లో ‘హిట్ అండ్ రన్’ కేసుల్లో పరిహారం చెల్లింపు మొదలగు అంశాలపై డిస్ట్రిక్ లెవెల్ అధికారుల మానిటరింగ్ మీటింగ్ ‘వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ కేసుల వివరాలు, కాంపెన్సేషన్ అంశాలపై చర్చించి, తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కడప, రాయచోటి సబ్ డివిజనల్ పోలీస్ అధికారులు, కడప, రాయచోటి రెవెన్యూ డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.


