రీసర్వే పనులను చురుగ్గా చేపట్టాలి
కడప సెవెన్‌రోడ్స్: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూ రికార్డుల స్వచ్ఛీకరణ, రీ సర్వే పనులను జిల్లాలో ప్రణాళిక ప్రకారం చురుగ్గా చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర రెవెన్యూ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, రాష్ట్ర భూ పరిపాలనా శాఖ (సీసీఎల్‌ఏ) ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మితో కలిసి భూముల రీ సర్వే ప్రక్రియలో భాగంగా వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి కలెక్టర్‌పాటు జేసీ నిధి మీనా హాజరయ్యారు. సీసీఎల్‌ఏ ప్రత్యేక కార్యదర్శి వీసీ ముగిసిన అనంతరం జిల్లాలోని అన్ని మండలాల రెవెన్యూ అధికారులతో వీసీ ద్వారా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రీసర్వే పూర్తి చేయాల్సిన గ్రామాలను ప్రతి నెలా ప్రతి నియోజకవర్గానికి 2 గ్రామాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మ్యూటేషన్‌లో భాగంగా సేల్, సబ్ డివిజన్, జాయింట్ ఎల్పీఎం తదితర వ్యక్తిగత వివరాలలో ఎటువంటి తప్పిదాలు లేకుండా పూర్తి చేసి పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. రాజంపేట సబ్ కలెక్టర్ భావన, ఆర్డీవోలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చంద్ర మోహన్, చిన్నయ్య హాజరవ్వగా కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి ల్యాండ్ సర్వే శాఖ ఈడీ శాంతరాజు తదితరులు పాల్గొన్నారు.
విద్యాప్రమాణాలను పెంపొందించాలి
విద్యా ప్రమాణాల పెంపుతో పాటు విద్యార్థులకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన సదుపాయాలను కల్పించాలని కలెక్టర్ విద్యాలయ యాజమాన్య కమిటీ సభ్యులకు సూచించారు. మంగళవారం రాత్రి తన ఛాంబర్‌లో కడప కేంద్రీయ విద్యాలయ యాజమాన్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ విద్యా సంవత్సరం జరిగే 10వ, 12వ తరగతి పరీక్షా ఫలితాల్లో కడప కెవి విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలను సాధించేలా తీర్చిదిద్దాలన్నారు. విద్యాలయ ప్రవేశాలు, ఫలితాలు, విద్యాలయ పురోగతికి చేపట్టవలసిన పనులు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి తగిన చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. అంతకుముందు అకడమిక్ కార్యకలాపాల గురించి ప్రిన్సిపల్ మునేశ్ మీనా కలెక్టర్ కు వివరించారు.
రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలి
జిల్లా రైతులను ఆర్థికంగా బలోపేతం చేసే దిశ గా అన్ని సీజన్లకు అవసమైన పంట రుణాలను అందించడంలో సహాయ సహకారాలు అందించాలని కమిటీ సభ్యులకు కలెక్టర్ శ్రీధర్ సూ చించారు. కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (కేడీసీసీబీ) ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ లెవెల్ టెక్నీకల్ కమిటీ (డీఎల్ టీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రైతులకు రుణ ప్రోత్సాహం తదితర అంశాల్లో జిల్లా సహకార కేంద్రం నిర్వహణ, అభివృద్ధిపై సమీక్షించి పలు సూచనలిచ్చారు.
● కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


