సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్: తమ న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ వివిధ బ్యాంకు ఉద్యోగులు మంగళవారం కడప నగరంలో కదం తొక్కారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్ కడపశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులు నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఏడురోడ్ల కూడలిలోగల కెనరా బ్యాంకు ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆందోళన కారులు మాట్లాడుతూ ఐబీఏ గతంలో యూఎఫ్‌బీయూతో చేసుకున్న ఒప్పందం మేరకు ఐదు రోజుల పనిదినాలను అమలు పరచడంలో గత రెండేళ్లుగా జాప్యం చేస్తోందన్నారు. ఈ విషయంగా పలుమార్లు యూనియన్‌తో చర్చలు జరిపినప్పటికీ అమలు పరచడం లేదన్నారు. ఐదు రోజుల పనిదినాలతోపాటు పీఎల్‌ఐ, పెన్షన్ అప్‌డేషన్, ఇతర డిమాండ్లను 2024 సంవత్సరం మార్చి నుంచి పెండింగ్‌లో ఉంచారన్నారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం జనవరి 22, 23 తేదీలలో సీఎల్‌సీ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు యూఎఫ్‌బీయూ పిలుపునిచ్చిందన్నారు. తమ ప్రధాన డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు విరమించేది లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో యూఎఫ్‌బీయూ కన్వీనర్ ఎస్‌ఏ అజీజ్, సెక్రటరీ శ్రీనివాసులురెడ్డి, బ్యాంకు ఎంప్లాయిస్ కో ఆర్డినేషన్ కమిటీ నేతలు దస్తగిరి, అనిలత్, లలిత, విజయ్, కేజియ, యూనియన్ నేతలు సంజీవ్‌కుమార్, రాంభాస్కర్‌రెడ్డితోపాటు ఇతర యూనియన్ ప్రతినిధులు, ఏఐటీయూసీ, సీఐటీయూ ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రజలకు తప్పని ఇబ్బందులు..
గత శనివారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులు, మంగళవారం సమ్మె కారణంగా అన్ని బ్యాంకుల లావాదేవీలు స్తంభించాయి. నాలుగు రోజులపాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు లేకపోవడంతో వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజువారీగా నగదు లావాదేవీలతోపాటు ఇతర బ్యాంకింగ్ సేవలు పొందేవారికి అవస్థలు తప్పలేదు.
డిమాండ్ల సాధనకు కదం తొక్కిన బ్యాంకు ఉద్యోగులు
వరుస సెలవులతో ప్రజలకు తప్పని ఇబ్బందులు


