భక్తిశ్రద్ధలతో అంకురార్పణ
నేడు ధ్వజారోహణం
కడప రాయుడు కప్పురపు రాయుడయ్యాడు. బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవ కళను సంతరించుకున్నాడు. పరిసరాలన్నింటికీ కొత్త పరిమళాలను సంతరించి పెట్టాడు. జిల్లాకే తలమానికంగా నిలిచే తిరుమల వాసుని ప్రతిరూపంగా కడప గడపను దివ్యంగా వెలిగిస్తూ ఉత్సవ శోభను కల్పించాడు. నేటి నుంచి పది రోజులపాటు రోజుకో వాహనంపై సూర్యప్రభ తేజంతో వెలిగిపోనున్నాడు. ఆ మహా మంగళమూర్తి బ్రహ్మోత్సవాలు ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసేందుకు భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.
విద్యుద్దీప వెలుగుల్లో ఆలయ ఆవరణం
కడప సెవెన్‌రోడ్స్: కడప రాయుడు దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మయూరం కృష్ణమోహన్‌తోపాటు మరికొందరు వేద పండితులు దీక్షా తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత విశ్వక్సేనునికి పూజ చేసి పుణ్యాహవాచనం నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణలో భాగంగా రక్షా కంకణధారణ నిర్వహించారు. అనంతరం పల్లకీలో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు టీటీడీ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో తరలివెళ్లారు. అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మృత్సంగ్రహణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ పుట్ట మట్టిని పల్లకీలో ఊరేగింపుగా ఆలయానికి చేర్చి అంకురార్పణ చేశారు. ప్రత్యేక విద్వాంసుల నాదస్వర, మంగళ వాయిద్యాల విన్యాసాలు ఉత్సవాలకు భక్తులను ఆహ్వానించాయి. ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించిన అంకురార్పణ కార్యక్రమాన్ని తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. టీటీడీ నుంచి వచ్చిన అధికారులు కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిచారు. ఈ సందర్బంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు బ్రహ్మోత్సవాలలో భక్తిభావాన్ని పెంచడంలో భాగంగా అన్నమాచార్యుల కీర్తనలను ఆలపించి ఆకట్టుకున్నారు. అనంతరం సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. రాత్రి హరికథా కాలాక్షేపం జరిగింది.
అంకురార్పణ పూజలు నిర్వహిస్తున్న వేద పండితులు, అర్చకులు పుట్ట మన్ను సేకరణకు వెళుతున్న అర్చకులు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 10 నుంచి 10.30 గంటల్లోపుగా తిరుచ్చి, ధ్వజారోహణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి అమ్మవారి సన్నిధిలో ఊంజల సేవ నిర్వహిస్తారు. ఇదే సమయంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు స్వామిపై కీర్తనలు ఆలపించనున్నారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామిని కొలువుదీర్చనున్నారు. ఆ తర్వాత స్వామి మహిమల గురించి కళాకారులు హరికథ ద్వారా వివరిస్తారు.
భక్తిశ్రద్ధలతో అంకురార్పణ
భక్తిశ్రద్ధలతో అంకురార్పణ
భక్తిశ్రద్ధలతో అంకురార్పణ


