బీపీఎస్.. అంతంతే!
నిబంధనలు ఇవీ..
కడప కార్పొరేషన్: బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్)కు అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయి. అసలే చాలామంది యజమానులు ఆసక్తి చూపించడం లేదు. ఆపై సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో బిల్డర్లు, భవన యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. కడప కార్పొరేషన్‌తోపాటు ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్, మైదుకూరు, కమలాపురం, రాజంపేట మున్సిపాలిటీల్లో ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించిన భవనాలు సుమారు 2వేలకు పైగా ఉన్నాయి. ఒక్క కడప నగరంలోనే సుమారు 1200 వరకూ ఉన్నట్లు అంచనా. పట్టణీకరణ నానాటికి విస్తరిస్తుండటంతో మునిసిపాలిటీల్లో కొత్త భవనాలు పుట్టుకొస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల వారు పట్టణాల్లో ఉండాలని భావిస్తున్నారు. ఫలితంగా పట్టణాల పరిధి విస్తరిస్తోంది. 2011 జనాభా కడప నగరంలో 3.50లక్షల జనాభా ఉండగా ప్రస్తుతం 4.50లక్షలకు చేరింది. అలాగే మిగిలిన మున్సిపాలిటీల్లో కూడా జనాభా అంతకంతకు పెరుగుతోంది.
అన్ని కట్టడాలు లెక్కలోకి వచ్చేనా...!
టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు కడపతోపాటు అన్ని మున్సిపాలిటీల్లో టౌన్‌ప్లానింగ్ సెక్రటరీలు బృందాలుగా ఏర్పడి నిర్మాణంలో ఉన్న భవనాలు, ప్లాన్‌కు విరుద్ధంగా కట్టిన భవనాలను గుర్తించారు. ఇందులో గుర్తించిన భవనాలకు బీపీఎస్ రెడ్ అక్షరాలతో రాశారు. వీటన్నింటిపై చర్యలు తీసుకోనున్నట్లు టౌన్‌ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగానే అనధికార కట్టడాల నిర్మాణం సాగుతోంది.
అక్రమ భవనాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం బీపీఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 1985 జనవరి 1 నుంచి 2025 ఆగస్ట్ 31లోపు అనధికారికంగా, ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు కల్పించింది. 2026 మార్చి 11వ తేదీలోపు యజమానులు క్రమబద్ధీకరించుకోవాలనే నిబంధన విధించింది. మొదట ఆన్‌లైన్‌లో రూ.10 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. టౌన్ ప్లానింగ్ అధికారుల తనిఖీల తర్వాత స్థలం విలువ, విస్తీర్ణం ఆధారంగా అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
తలెత్తుతున్న ఆన్‌లైన్ సమస్యలు
జిల్లాలో సుమారు 2వేలకు పైగా అనధికార కట్టడాలు
ముందుకురాని యజమానులు
సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం బీపీఎస్ పథకాన్ని గతేడాది నవంబర్‌లో ప్రవేశపెట్టింది. భవన నిర్మాణ యజమానులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. యజమానులకు అవగాహన కల్పించేందుకు ప్రధాన కూడలిల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాం. ప్రజా ప్రతినిధులు, బిల్డర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. – శైలజ, సిటీప్లానర్,
కడప మున్సిపల్ కార్పొరేషన్.


