సౌమ్యనాథా.. కరుణించు స్వామీ!
● 11వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం
● ఎన్నో ఏళ్లుగా జరగని మహాసంప్రోక్షణ
● టీటీడీ దృష్టి సారించాలి
దక్షిణ భారతదేశంలో అతి పెద్ద
వైష్ణవ ఆలయం నందలూరులోని
సౌమ్యనాథాలయం. ఈ ఆలయం
11వ శతాబ్దంలో నిర్మితమైన క్రమంలో
అలనాటి చోళరాజులు కాలంలో సంప్రోక్షణ జరిగింది. ఆ తర్వాత సంప్రోక్షణ జరగలేదని చరిత్రకారులు చెపుతున్న మాట.
రాజంపేట : నందలూరులో 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించిన సౌమ్యనాథాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అభయహస్తం భంగిమలో ఆరు అడుగుల ఒక పెద్ద, నిర్మలమైన విష్ణు విగ్రహం ప్రతిష్టించారు. దేవతలు కట్టిన ఆలయంగా పేరు ప్రఖ్యాతలు పొందింది. ఎర్రని రాతితో నిర్మించారు. స్వామివారి పాదాలను ప్రకాశింప చేసే సూర్యకిరణాలు శాంతికి ప్రతీక. చోళులు నిర్మించిన ఒక ప్రత్యేక నిర్మాణ అద్భుతం. భక్తులను, నిర్మాణ ఔత్సాహికులను ఆకర్షిస్తుంది.
2022లో టీటీడీలోకి విలీనం
ఈ ఆలయం కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. అయితే దేవదాయ శాఖ ఆలయ నిర్వహణను కొనసాగిస్తూ వచ్చింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలోకి విలీనం చేశారు. 2022 నవంబరు 20న అధికారికంగా టీటీడీ నిర్వహణలోకి ఆలయం చేరింది.
9 శతాబ్దాలకు పైగా కూడా..
ఆలయ పునఃనిర్మాణ తర్వాత, కొన్నేళ్లకు ఒకసారి, ఏదైనా అరిష్టం తొలిగించడానికి మహాససంప్రోక్షణ చేపట్టాలని వేదపండితులు చెబుతున్నారు. దీనివల్ల వైభవం పెరుగుతుంది. దీనిలో అనేక యజ్ఞాలు, పూజలు ఉంటాయి. సంప్రోక్షణ అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన కర్మలలో ఒకటిగా వేదపండితులు పేర్కొంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో 12 ఏళ్లకు ఒకసారి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వహిస్తుంటారు. కానీ నందలూరు సౌమ్యనాథాలయంలో 9 శతాబ్దాలు అయినా మహాసంప్రోక్షణ చేయకపోవడమే ప్రశ్నార్థకరంగా మారింది. ఈ అంశంపై తిరుమల తిరుపతి దేవస్ధానం కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చరిత్రకారులు అభిప్రాయ పడుతున్నారు.
సంప్రోక్షణ అంటే..
సంప్రోక్షణ అంటే దేవాలయాలు, విగ్రహాలు, పవిత్ర వస్తువులు శుద్ధి చేయడానికి, పున ఃప్రతిష్టించడానికి చేసే ఒక ముఖ్యమైన వైదిక కర్మ, దీన్ని మహాసంప్రోక్షణం అని కూడా అంటారు. ఇందులో మంత్రాలు, యజ్ఞాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేస్తారు. ముఖ్యంగా తిరుమల వంటి పెద్ద దేవాలయాల్లో నిర్వహిస్తారు. ఇది దేవాలయానికి కొత్త శక్తిని ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఇదే ఇప్పుడు అతిపెద్ద వైష్ణవ దేవాలయంలో చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆధ్యాత్మిక వేత్తలు తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారు.
ఆలయంలోని ఆళ్వారులు ఏమయ్యారు..
సౌమ్యనాథాలయంలో వైష్ణవ ఆరాధకులుగా భావిస్తున్న 12 మంది ఆళ్వారుల విగ్రహాలు ఏమయ్యాయన్నది.. అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోయింది. ఆలయంలో పడమర వైపు రాతిపీఠంపై 12 మంది ఆళ్వారులు రాత్రి విగ్రహాలు ఉండేవి. అవి ఇప్పుడు కనిపించడం లేదు. పైయిగయ్ ఆళ్వార్, భరత్ ఆళ్వార్, పేయి ఆళ్వార్, తొండరడిపడి ఆళ్వార్, తిరుపాన్ ఆళ్వార్, తిరుమలై ఆళ్వార్, కూడల్ ఆళ్వార్ తదితర ఆళ్వారులు అనే నామదేయంతో అప్పట్లో ప్రాచుర్యం పొందారు. వీరిలో కులశేఖర్ ఆళ్వార్ ముకుందమనే గ్రంథం రచన చేశారు. ఈ ఆళ్వారులు తమిళ, మళయాల ప్రాంతానికి చెందినవారు. ఆళ్వారు పుట్టిన రోజు నాడు వైష్ణవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి.
విష్ణుమూర్తి నేరుగా దర్శనం
పూర్వం ఆళ్వారు హయాంలో విష్ణుమూర్తి నేరుగా దర్శనిమిచ్చేవారని చరిత్ర చెపుతున్న విశ్వాసం. అట్టి ప్రాధాన్యత కలిగిన ఈ ఆళ్వారులకు తగిన ప్రాచుర్య ఆదరణ లేకపోవడంతో కాలగర్భంలో కలిసిపోయారు. పురాతన చరిత్ర కలిగిన సౌమ్యనాథాలయంలో 12 మంది ఆళ్వారుల విగ్రహాల్లో పది విగ్రహాలు చెక్కు చెదిరిపోయాయి. వీటిని కేంద్రపురావస్తుశాఖ స్వాధీనం చేసుకున్నట్లు మూడు దశాబ్దాల కిందట జరిగిందని స్థానికులు చెపుతున్నారు. వీటిని ప్రతిష్టించడం అటు కేంద్రపురావస్తు శాఖ మరిచిపోయింది. అతిపెద్ద వైష్ణవ ఆలయంలో ఆళ్వారుల విగ్రహామూర్తులు ఉండటం విశేషం. అటువంటి విశేషం ఇప్పుడు కనుమరుగైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వారుల విగ్రహాలను పునఃప్రతిష్టించేలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వైష్ణవభక్తులు కోరుతున్నారు.
మరింత శోభ
నందలూరు సౌమ్యనాథాలయం మహాసంప్రోక్షణతో మరింత శోభ సంతరించుకుంటుంది. ఈ ఆలయానికి ఇప్పటి వరకు మహాసంప్రోక్షణ జరగలేదు. శతాబ్దాల కిందట ఆలయ నిర్మాణంలో భాగంగా మహాసంప్రోక్షణ జరిగివుండవచ్చు. ఇప్పటి వరకు ఆలయానికి మహాసంప్రోక్షణ జరగలేదనే అంశం భక్తులలో చర్చనీయాంశంగా మారింది. టీటీడీ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలి. అలాగే కనుమరుగైన ఆళ్వారు విగ్రహాలను పునఃరుద్ధరించాలి.
– పోతుగుంట రమేష్‌నాయుడు, చైర్మన్, శ్రీశైలం దేవస్ధానం
మహాసంప్రోక్షణ చేయాలి
తిరుమల తిరుపతి దేవస్థానం నందలూరు సౌమ్యనాథాలయానికి మహాసంప్రోక్షణ చేయాలి. దాదాపు 9 శతాబ్దాలకు పైగా అంటే ఆలయ నిర్మిత ప్రారభంలో మహాసంప్రోక్షణ జరిగి వుంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మహాసంప్రోక్షణ జరగలేదు. ఒంటిమిట్ట రామాలయం తరహాలోనే సౌమ్యనాథాలయంలో కూడా మహాసంప్రోక్షణ చేయాల్సిన బాధ్యత టీటీడీపై ఉంది. ఆ దిశగా టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఆలోచన చేయాలి.
– విద్వాన్ గానుగపెంట హనుమంతురావు,
శ్రీ సౌమ్యనాథ దివ్వధామం గ్రంథ రచయిత, కడప
సౌమ్యనాథా.. కరుణించు స్వామీ!
సౌమ్యనాథా.. కరుణించు స్వామీ!
సౌమ్యనాథా.. కరుణించు స్వామీ!


