భాషా సాహితీ రంగాల్లో జిల్లాపై వివక్ష | - | Sakshi
Sakshi News home page

భాషా సాహితీ రంగాల్లో జిల్లాపై వివక్ష

Aug 29 2025 2:40 AM | Updated on Aug 29 2025 2:40 AM

భాషా

భాషా సాహితీ రంగాల్లో జిల్లాపై వివక్ష

భాషను బ్రతికించుకోవాలి

సీమపై వివక్ష తగదు

నేడు తెలుగు భాషా దినోత్సవం

కడప సెవెన్‌రోడ్స్‌ : తొలి తెలుగు శాసనం లభించిన జిల్లా కడప. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య, తొలి తెలుగు కవయిత్రి మొల్ల, తాళ్లపాక తిమ్మక్కలకు జన్మనిచ్చిన జిల్లా. నన్నయ్య కన్న ఎంతో ముందువాడైన నన్నెచోడుడు ఈ జిల్లా వాసి. సంఘ సంస్కర్తలు వేమన, బ్రహ్మంగారు నడయాడిన జిల్లా. సీపీ బ్రౌన్‌ మహాశయుడు తెలుగుభాషా సాహిత్యాల సముద్ధరణ మహాయజ్ఞాన్ని సాగించింది ఇక్కడే. ఆధునిక మహకావ్యంగా పండితులు అభివర్ణించే శివతాండవం సృష్టికర్త పుట్టపర్తి తిరుగాడిన జిల్లా కడప. మిగతా రంగాలతోపాటు భాషా సాహితీ అంశాలలో సైతం పాలకులు జిల్లా పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా ఓమారు ఈ అంశాలను సింహావలోకనం చేసుకుంటే...

నన్నెచోడుడికి దక్కని ఆది కవి హోదా

కడప జిల్లా పొత్తపినాడుకు చెందిన కవి. కుమారసంభవం అనే కావ్యాన్ని రాశారు. కాళిదాసు రచనలోని ఇతివృత్తాన్ని మాత్రమే తీసుకుని రాశారు. తెలుగు సాహిత్య రంగంలో నన్నయ్య కన్నా ముందువాడైన నన్నెచోడుడు 925–40 మధ్యకాలం వారని తెలుస్తోంది. నన్నెచోడుడు రాసిన కుమారసంభవం కావ్యాన్ని కనుగొని పరిష్కరించి వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత సుప్రసిద్ధ సాహితీ పరిశోధకుడు, కవి, సంస్కృతాంధ్ర పండితుడు, బహుభాషా కోవిదుడైన మానవల్లి రామకృష్ణ కవికి దక్కుతుంది. అప్పటి వరకూ తెలుగు సాహిత్యంలో నన్నెచోడుడు అనే కవి ఉన్నారనే విషయమే ఎవరికీ తెలియదు. తంజావూరులోని సరస్వతి మహల్‌ గ్రంథాలయంలో ఒక మూలపడి ఉన్న కుమారసంభవం తాళపత్ర గ్రంథాన్ని రామకృష్ణ కవి కనుగొన్నారు. దాన్ని పరిష్కరించి 1909లో ప్రకటించారు. నన్నెచోడుడు నన్నయ్య కంటే ముందువాడని శాసనాధారాలతో ప్రకటించారు. రామకృష్ణ కవి చేసిన ప్రతిపాదన పండిత లోకాన్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ప్రతిపాదనపై చర్చోపచర్చలు, వాదోపవాదాలు వాడిగా వేడిగా జరిగాయి. చిలుకూరి వీరభద్రరావు, వేటూరి ప్రభాకరశాస్త్రి, జయంతి రామయ్య పంతులు, పింగళి లక్ష్మికాంతం, నిడదవోలు వెంకటరావు, ఆరుద్ర మొదలైన వారు దీన్ని వ్యతిరేకించారు. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, పుట్టపర్తి నారాయణచార్యులు వంటివారు మానవల్లి ప్రకటనను సమర్థించారు. మల్లంపల్లె సోమశేఖరశర్మ సరసర చెప్పుకోదగ్గ ప్రముఖ శాసన పరిశోధకులు, హైదరాబాదుకు చెందిన బీఎన్‌ శాస్త్రి కుమార సంభవంపై పరిశోధన చేసి నన్నయ్య కన్నా నన్నెచోడుడే ముందు వాడని శాసన ఆధారంగా నిరూపించారు. కందుకూరి వీరేశలింగం రాసిన ఆంధ్ర కవుల చరిత్రలో ఈ విషయానికి సంబంధించిన శాసనం ఉందంటూ పేర్కొనడం విశేషం. నన్నెయ్యకే ఆదికవి హోదా దక్కాలనే కోస్తా ప్రాంతానికి చెందిన సాహితీవేత్తల అభిప్రాయానికే ప్రభుత్వాలు విలువనిచ్చాయి. నన్నెచోడుడికి ఆది కవి హోదా లభించక కడపజిల్లాకు తీరని అన్యాయం జరిగింది.

తెలుగు సూర్యుడు సీపీ బ్రౌన్‌

తెలుగు భాషా సాహిత్యాల సముద్ధరణకు జీవితాంతం ఆవిరళ కృషి చేసిన మహానీయుడు సీపీ.బ్రౌన్‌. తాళపత్ర గ్రంథాలు, కావ్యాలు, శతకాలు, వేమన పద్యాలను స్వంత ఖర్చులతో సేకరించారు. పండితులకు స్వంతంగా జీతాలు ఇచ్చి శుద్ధప్రతులను కాగితాలపై రాయించారు. కొన్నింటికి వ్యాఖ్యానాలు రాయించి ముద్రించారు. వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించి తెలుగు కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు. తెలుగు వ్యాకరణం, నిఘంటువులు, నిత్యం పరిపాలన వ్యవహారాల్లో ఉపయోగించే రెవెన్యూ జ్యుడిషియల్‌ పదజాలాన్ని సేకరించి నిఘంటువు తయారు చేశారు. ఆయన కృషి లేకపోతే నేడు తెలుగు భాషా సాహిత్యాలు ఈ స్థితిలో ఉండేవి కావు. అలాంటి మహానుభావుడి గురించి పాఠ్యాంశాల్లో చేర్చకపోవడం విచారకరం. సీపీ బ్రౌన్‌ పేరిట కనీసం పురస్కారాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఈ ప్రాంత సాహితీవేత్తలు కోరుతున్నారు.

పుట్టపర్తికి దక్కని జ్ఞానపీఠం

శ్రీకృష్ణ దేవరాయల రాజగురువు తాతాచార్యుల వంశానికి చెందిన పుట్టపర్తి నారాయణాచార్యులు కడప నగరానికి చెందిన వారు. ఆధునిక మహాకావ్యంగా పండితులు అభివర్ణించే శివతాండవం సృష్టికర్త. జనప్రియ రామాయణం, మేఘదూతం వంటి గేయ కావ్యాలు రాశారు. అనేక భాషలు తెలిసిన వ్యక్తిగా పీవీ.నరసింహారావు పేరు మారుమోగుతోంది గానీ పుట్టపర్తి పేరు అంతగా వినిపించదు. తుళు, ఫ్రెంచ్‌, పర్షియన్‌, అవఽధీ, బ్రజ్‌, కన్నడ, మళయాళ, మరాఠి, సంస్కృతం, ఇంగ్లీషు వంటి 14 బాషల్లో పాండిత్యం సాధించిన దిట్ట పుట్టపర్తి. వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీకృష్ణ దేవరాయల విశ్వవిద్యాలయం ఆయనకు డీలిట్‌ ప్రదానం చేశాయి. భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. నిజానికి ఆయన జ్ఞానపీఠ అవార్డుకు అర్హులు. పుట్టపర్తి ఏ కోస్తా జిల్లాలోనో జన్మించి ఉంటే ఆయన్ను ఏనాడో జ్ఞానపీఠం వరించేదని పలువురు సాహితీవేత్తల అభిప్రాయం.

పురస్కారాల్లోనూ వివక్షే

తెలుగు వ్యవహారిక భాషా ఉద్యమ పితామహులైన గిడుగు రామ్మూర్తి పంతుల జయంతిని ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా పాటిస్తోంది. భాషా సాహిత్యాలకు విశేష కృషి చేసిన పలువురికీ ఈ సందర్భంగా పురస్కారాలు అందించి గౌరవించడం చాలా కాలంగా వస్తోంది. గతేడాది నిర్వహించిన పురస్కారాల్లో జిల్లా విషయంలో ఆ మాటకొస్తే రాయలసీమ పట్ల వివక్షే ప్రదర్శించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో పురాస్కరాలు పొందిన ఇద్దరికి పురస్కారాలు అందించి చేతులు దులుపుకొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రాంతీయ సమతుల్యత పాటించలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యమని, ప్రాంతాల మధ్య విబేధాలు పెరిగేందుకు దోహదం చేస్తుందని ఇక్కడి సాహితీవేత్తలు పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం ఓట్ల రాజకీయాలకు పెద్దపీట వేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికై నా జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని పలువురు కోరుతున్నారు.

మాతృభాష తెలుగును ఆంగ్ల బారి నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. విద్య వ్యాపారంగా మారిన పరిస్థితుల్లో తెలుగుభాష చీకటి కోణాల్లోకి వెళ్లిపోతోంది.పాఠశాల స్థాయి నుంచి స్నాతకోత్తర స్థాయి వరకు ప్రతిచోట నిర్లక్ష్య ధోరణి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నన్నయ్య నుంచి నేటి వరకు తెలుగుభాష పలు మార్పులకు లోనై గిడుగు రామ్మూర్తి వ్యవహారిక భాషోద్యమంతో తెలుగు పండిత భాష నుంచి ప్రజల భాషకు చేరింది. భాషను మనం బ్రతికించుకోకపోతే మన సంస్కృతికి మనమే దూరమవుతున్నట్లు లెక్క.

– డాక్టర్‌ పొదిలి నాగరాజు, తెలుగు అధ్యాపకులు, కడప

నన్నెచోడుడు నన్నయ్య కన్నా ముందువాడనే వాదనపై ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీ నియమించి నిగ్గుతేల్చాలి. సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రాన్ని కేంద్ర స్థానంగా చేసుకోవాలి. అన్నమయ్యలోని సంఘ సంస్కరణ భావాలు, ఆయన పద ప్రయోగాలు, తిరుగాడిన స్థలాలు పరిశోధించడానికి ఒక ప్రత్యేక సంస్థ ఏర్పాటుచేయాలి. నాచన సోముని వంటి అనేక మంది రాయలసీమ కవులకు గుర్తింపు లేకుండాపోయింది. వేమన, పోతులూరి వీరబ్రహ్మం ప్రాచీన కాలంలో సంఘ సంస్కరణ కవులు. బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో వీరి సాహిత్యం మీద పరిశోధనలను ప్రోత్సహించాలి. కట్టమంచి, పుట్టపర్తి లాంటి వారికి ఏమాత్రం గుర్తింపులేకుండా పోయింది. బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రాన్ని రాయలసీమలోనే గొప్ప పరిశోధన కేంద్రంగా అభివృద్ది చేయాలి. భాషా పరిశోధకులు, నిఘంటువు నిర్మాతలు, కావ్య పరిష్కర్తలు, వ్యాఖ్యాతలకు సీపీ బ్రౌన్‌ పేరిట పురస్కారాలు అందించాలి. తొలి తెలుగు కవయిత్రి మొల్ల, తాళ్లపాక తిమ్మక్క, తరిగొండ వెంబమాంబలకు గుర్తింపు వచ్చేటట్లు పరిశోధనలు ప్రోత్సహించాలి.

– రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి, అధికారభాషా సంఘం మాజీ సభ్యులు

భాషా సాహితీ రంగాల్లో జిల్లాపై వివక్ష 1
1/2

భాషా సాహితీ రంగాల్లో జిల్లాపై వివక్ష

భాషా సాహితీ రంగాల్లో జిల్లాపై వివక్ష 2
2/2

భాషా సాహితీ రంగాల్లో జిల్లాపై వివక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement