
బద్వేల్ నియోజకవర్గాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలి
బద్వేలు అర్బన్ : బద్వేల్ నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో చేర్చాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకుని కడప జిల్లాలోనే కొనసాగించాలని బద్వేలు నియోజకవర్గ పరిరక్షణ సమితి అధ్యక్షుడు చీపాటి రాజేశ్వరరావు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక నాయకులు బి.నారాయణరెడ్డి కోరారు. స్థానిక ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయ సభా భవనంలో నిర్వహించిన సమావేశంలో బుధవారం వారు మాట్లాడుతూ జిల్లాలోని అత్యంత వెనుక బడిన, ఎంతో చరిత్ర కలిగిన బద్వేల్ నియోజకవర్గాన్ని ఇక్కడి ప్రజల మనోభావాలను, ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా అన్నమయ్య జిల్లాలోకి మార్చాలనుకోవడం సరికాదన్నారు. నియోజకవర్గంలోని కలసపాడు, కాశినాయన మండలాల నుండి రాజంపేటకు వెళ్లాలంటే వందల కిలో మీటర్లు ప్రయాణించాల్సి వస్తుందన్నారు. ఈ ప్రాంతంలో అధికంగా ఉన్న బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని బద్వేల్ నియోజకవర్గాన్ని కడప జిల్లాలో కొనసాగించాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, వీరబ్రహ్మేంద్రస్వామి జిల్లా సాధన సమితి అధ్యక్ష, కార్యదర్శులు బ్రహ్మారెడ్డి, చంద్రఓబుల్‌రెడ్డి, సీనియర్ దళిత నాయకులు పిచ్చయ్య, కేశవయ్య, నారాయణ, సీపీఐ పట్టణ కార్యదర్శి బాలు, ఏపీ వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగేశం పాల్గొన్నారు.