సత్య.. ఇక అమాత్య ! | - | Sakshi
Sakshi News home page

సత్య.. ఇక అమాత్య !

Jun 13 2024 12:38 AM | Updated on Jun 13 2024 8:37 AM

-

సాక్షి ప్రతినిధి, కడప : వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరువాసి సత్యకుమార్‌ యాదవ్‌ ఆదినుంచి ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలో చురుగ్గా ఉన్నారు. టెన్త్‌ వరకు ప్రొద్దుటూరులోనే చదివిన ఆయన పాలిటెక్నిక్‌ విద్యనభ్యసించేందుకు అప్పటి చిత్తూరు జిల్లా మదనపల్లికి వెళ్లారు. అక్కడ ఏబీవీపీ నాయకుడిగా ఉన్నారు. అక్కడి బీజేపీ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డితో ఉన్న చనువు కారణంగా ఆయన ద్వారా అప్పటి బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడుకు చేరువయ్యారు. ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసిన కాలంలో వ్యక్తిగత సహాయకుడిగా, ఓఎస్డీగా సేవలందించారు.

 అప్పటి నుంచి కేంద్ర రాజకీయాల్లో చురుకై న పాత్ర పోషించారు. వెంకయ్యనాయుడుకు ఉప రాష్ట్రపతి పదవి దక్కడంతో సత్యకుమార్‌ను పార్టీ అధిష్టానం బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమించింది. కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఇన్‌చార్జిగా పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా తదితర నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే స్థానికేతరుడైనప్పటికీ సత్యసాయిజిల్లా ధర్మవరం నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేశారు. 

ఈయన ఎన్నికల ప్రచార సభకు అమిత్‌షా సైతం హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఢిల్లీ పెద్దల ఆశీస్సులతోమంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. సత్యగా పిలుచుకునే ఆయన సన్నిహితులు ఆయనకు మంత్రి పదవి లభించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీచేసిన తొలిసారే విజయం సాధించడం, మంత్రివర్గంలో చో టు సంపాదించడంతో డబుల్‌ ధమాకా సాధించినట్లయింది.

సీనియర్లకు లభించని అవకాశం
ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా గెలిచి రాజకీయంగా విశేషానుభవం ఉన్న ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజులరెడ్డి, చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డిలకు చంద్రబాబు మంత్రివర్గంలో అవకాశం లభించలేదు. బీజేపీకి లభించే ఛాన్సును చేజెక్కించుకునేందుకు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది విశేషంగా ప్రయత్నించారు. కాగా బీజేపీ అధిష్టానం మొదటి నుంచి బీజేపీలో ఉన్న వారికే అవకాశం కల్పించాలనే నిర్ణయానికి రావడంతో ఆదికి మంత్రి పదవి చేజారినట్లు పలువురు వివరిస్తున్నారు. రాజకీయాల్లో సీనియర్‌గా 6సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై న చరిత్ర జిల్లాలో నంద్యాల వరదరాజులరెడ్డికి ఉంది. ఈమారు మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. ఆమేరకు భారీగా ప్రయత్నాలు చేశారు. పొరుగు రాష్ట్రానికి చెందిన ముఖ్యనేత ద్వారా విశేషంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.

మాధవీరెడ్డికి నిరాశ
కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి మంత్రి పదవి కోసం విశేషంగా ప్రయత్నించారు. టీడీపీ తరఫున 20 ఏళ్లుగా కడప ఎమ్మెల్యేగా ఎవరూ గెలుపొందని నేపథ్యంలో టికెట్‌ దక్కించుకున్న తొలిసారే విజయం సాధించారీమె. దీంతో మహిళ కోటాలో మంత్రియోగం కల్పించాలని అభ్యర్థించారు. తుదివరకూ మాధవీరెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒక దశలో చంద్రబాబు ఆమె వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు లోకేష్‌ రాజకీయ సమీకరణల నేపధ్యంలో రామ్‌ప్రసాద్‌రెడ్డికి అవకాశం కల్పించా ల్సిందిగా పట్టుబట్టినట్లు సమాచారం. పైగా జిల్లా లోని ముఖ్యనేతలు వాసు కుటుంబానికి మంత్రి పదవి కేటాయించడాన్ని సమర్థించలేదని సమాచారం.ఫలితంగా చివరి నిమిషంలో ఆమెకు మంత్రియోగం చేజారినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement