
యంత్రంలో ఫలితాలు.. బెట్టింగ్‌ల జోరు
కడప కల్చరల్ : హిమాలయ పర్వతాన్నైనా ఢీకొంటాం..ఎంతటి ధీరుడినైనా లక్షల మెజార్టీతో ఓడిస్తాం..రాష్ట్రమంతటా క్లీన్ స్వీప్ చేస్తాం..అంటూ నిన్నటివరకు తొడలు కొట్టారు..జబ్బలు చరిచారు.. గెలిచేది మేమే అంటూ సహచరులతో బీరాలు పలికారు. ప్రస్తుతం వాతావరణంతోపాటు ఎన్నికల వాతావరణం చల్లబడింది. నిన్నటివరకు ఎన్నికల్లో హడావుడిగా తిరిగిన వారంతా ఇంటికే పరిమితమయ్యారు. మరికొందరు నాయకులు తీరిగ్గా తమ పార్టీ విజయంపై చర్చలు చేస్తూ బెట్టింగ్‌లకు దిగారు.
సంక్రాంతిలో కోడిపందేల సీజన్‌లాగా ఎన్నికల సీజన్‌లో బెట్టింగ్‌లు సాధారణమే. ఈసారి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. అన్ని పార్టీలు గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డాయి. ఇందులో సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రజాభిమానాన్ని కొల్లగొట్టిన పార్టీలకే విజయావకాశాలు ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. పోలింగ్ అయ్యాక చిన్నా, చితకా నాయకుల నుంచి బడా నాయకుల వరకు మొబైల్ ఫోన్లలో యూ ట్యాబుల్లో వచ్చే రకరకాల సర్వేలు చూసుకుంటూ తమ పార్టీకి అనుకూలంగా ఉన్న ఫలితాలతో లేని ఉత్సాహం తెచ్చుకుంటున్నారు. ఇతర పార్టీలకు అనుకూలంగా ఉన్న సర్వేలను తిట్టి పోస్తున్నారు. మరికొందరు శాంతికామకులు తమకు మంచి ఫలితాలివ్వాలని దేవుళ్లను కోరుతూ గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. జూన్ 4వ తేదీ వరకు ఆగండర్రా..ఎందుకు తొందర పడతారు...అని అనుభవజ్ఞులు వారిస్తున్నా వినిపించుకోవడంలేదు.
భారీగా బెట్టింగులు
ఎన్నికల ఫలితాలు యంత్రంలో గుట్టుగా ఉండగా, నాయకులు మాత్రం తెచ్చి పెట్టుకున్న ఉత్సాహంతో తమ పార్టీయే గెలుస్తుందని, పందెం కట్టే దమ్ముంటే రావాలంటూ సవాళ్లు విసురుతున్నారు. గంటకో రకం సర్వేలు వస్తుండగా, వాటిని నమ్మి కొందరు లక్షల రూపాయల్లో బెట్టింగ్ కాస్తున్నారు. ముందెన్నడూ లేని విధంగా ఈసారి బెట్టింగ్‌ల హడావుడి బాగా పెరిగింది.ప్రస్తుతం బెట్టింగ్‌లు, చాలెంజ్‌లు కంప్యూటర్ల స్థాయికి చేరాయి. పందేలు, ఇచ్చిపుచ్చుకోవడాలు అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. పలువురు నాయకులు తమకు అనుకూలంగా ఉన్న సర్వేల సంఖ్య చూసుకుని తామే గెలుస్తామంటూ లక్షల్లో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. మరికొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని కూడా బెట్టింగ్‌లకు వాడుతున్నారు. ఇంకొందరు ఏజెన్సీల ద్వారా బెట్టింగులకు పాల్పడుతున్నారు. పలుచోట్ల కట్టిన బెట్టింగ్‌లను వాపసు తీసుకుంటున్నారు.
ముందుజాగ్రత్త
అంతగా పేరు లేని ఓ నాయకుడికి అనుకోకుండా మొన్నటివరకు ఓ వెలుగు వెలిగి మూలనపడ్డ ఓ జాతీయ పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది. ఎమ్మెల్యేగా పోటీకి దిగారు. తన విజయంపై ఏమాత్రం ఆశ లేని ఆయన పార్టీ ఇచ్చిన ఫండ్‌ను సగానికి మాత్రమే పంపిణీ చేసి మిగతాది జేబులో వేసుకున్నాడు. మిగతా సొమ్మును గెలిచే అవకాశం గల పార్టీపై ఏజెన్సీ ద్వారా బెట్టింగ్ పెట్టాడు. ఆ పార్టీ ఎటూ గెలుస్తుందని తన సొమ్ముకు డబుల్‌అమౌంట్ వస్తుందని ఆయనకు పూర్తి నమ్మకం. పంపిణీలో అంతో ఇంతో మిగుల్చుకున్న చోటా మోటా నాయకులు కూడా బెట్టింగ్ రాయుళ్ల, ఏజెన్సీల మాయలోపడి పందేలకు పాల్పడుతున్నారు.
యూ టర్న్
ఆ పార్టీ ఓడిపోతుందని ఓ పెద్ద పార్టీపై ప్రతిపక్షాలన్నీ కట్టగట్టుకుని ప్రచారం సాగించాయి. ఫలితంగా ఆ పార్టీకి అనుకూలంగా పందెం కాసేవారే కరువయ్యారు. పోలింగ్ గడిచిన రెండు రోజుల తర్వాత నుంచి ఆ పార్టీ విజయవకాశాలపై నమ్మకం కుదరడంతో ఆ పార్టీపై బెట్టింగ్‌లు పెరిగాయి. అంతవరకు కళకళలాడుతూ ఉండిన గ్రూపు పార్టీల బెట్టింగ్ కౌంటర్లు ప్రస్తుతం క్రమంగా వెలవెలబోతున్నాయి. ప్రజల్లో విశ్వాసం ఉన్న పార్టీ మాత్రమే విజయం సాధిస్తుంది. అంతవరకు వేచి చూడక తప్పదు. లేనిపోని దురాశతో బెట్టింగ్‌లకు పాల్పడితే నిరాశ తప్పదని పలువురు విజ్ఞులు హితవు చెబుతున్నారు. డబ్బు వెచ్చించి బీపీలు పెంచుకుని అనారోగ్యం పాలు కావడం ఎందుకని, బెట్టింగ్‌లకు పాల్పడకుండా ఉండాలని సూచిస్తున్నారు.
ప్రతిపక్షాల్లో తగ్గుతున్న హుషారు
పలుచోట్ల కట్టిన బెట్టింగ్ వాపసు