కూతురు అదృశ్యంపై ఫిర్యాదు... తల్లిపై కానిస్టేబుల్‌ అకృత్యం!

- - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: కాపాడాల్సిన రక్షకభటుడే కాటేయజూశాడు. అండగా వచ్చాడనుకుంటే అవకాశం తీసుకోవాలనుకున్నాడు. పుట్టెడు వేదనలో ఉన్న బాధితురాలిపై లైంగికదాడికి విఫలయత్నం చేశాడు. చాలారోజులు ఎవ్వరికీ చెప్పుకోలేక ఆవేదనను అణచిపెట్టుకుంది. తనలా మరో మహిళ ఇలాంటి ఇబ్బందులు పడకూడదని నిర్ణయించుకుంది. హెడ్‌కానిస్టేబుల్‌ నిర్వాకాన్ని బహిర్గతం చేసింది. సోషల్‌ మీడియా కేంద్రంగా ఇప్పుడా వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఆమె ఆరోపించిన మేరకు వివరాలిలా ఉన్నాయి.

ఓబులవారిపల్లె మండలంలోని చిన్నఓరంపాడు భద్రావతి కాలనీకి చెందిన పేరూరు దుర్గమ్మ మైనర్‌ కుమార్తె సెప్టెంబర్‌ నెల 23న గ్రామానికి చెందిన మరో అబ్బాయితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయమై స్థానిక పోలీస్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ క్రమంలోనే ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి బాలికను వెతికేందుకు హెడ్‌కానిస్టేబుల్‌ భాస్కర్‌, మహిళా పోలీసు రేవతిలను దుర్గమ్మతో పాటు అక్టోబర్‌ 6వ తేదీన హైదారాబాదుకు పంపించారు. అక్కడ ఓలాడ్జిలో హెడ్‌ కానిస్టేబుల్‌ దుర్గమ్మతో దుర్మార్గంగా ప్రవర్తించాడు. లైంగికంగా వేధించాడు. ఎంత వారించినా చెయిపట్టుకున్నాడు. అసభ్యంగా ప్రవర్తించి బూతులు మాట్లాడాడు. ఇందుకు మహిళా పోలీసుల కూడా సహకరించింది. ఈ నేపథ్యంలో బాలిక ఫోన్‌ చేయడంతో అందరూ వెనుతిరిగి వచ్చారు.

ఈ విషయాలన్నీ వివరిస్తూ దుర్గమ్మ వీడియో తీసింది. అందులో కొద్ది రోజుల తర్వాత తన కుమార్తె మళ్లీ అదే అబ్బాయితో వెళ్లింద, తమకు న్యాయం చేయలేదని కూడా పేర్కొంది. ఈ వీడియో శుక్రవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కాగా, ఈ విషయంపై ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డిని వివరణ కోరగా రెండు నెలల క్రితం జరిగిన ఘటనను ఇంతవరకు ఎందుకు బహిర్గతం చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఎవరో ఉద్దేశపూర్వకంగా అమెతో మాట్లాడించారని, ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోతే జిల్లా ఎస్‌పీకి ఫిర్యాదు చేసిన వారు, ఇంత జరిగితే స్థానికంగా లేదా ఉన్నతాధికారులకు గానీ ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఆయ సందేహం వ్యక్తం చేశారు.

హెచ్‌సీ భాస్కర్‌ సస్పెన్షన్‌
ఓబులవారి పల్లి హెడ్‌ కానిస్టేబుల్‌ అయిన డి.భాస్కర్‌ పైన వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అతడిని అన్నమయ్య జిల్లా ఎస్పీ బి.రామకృష్ణ శుక్రవారం రాత్రి సస్పెండ్‌ చేశారు. అతడిని తక్షణమే విధుల నుండి తొలగించినట్లు రాజంపేటీ డీఎస్పీ వీఎన్‌కే చైతన్య తెలిపారు.

Read latest YSR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top