10 కిలోమీటర్ల వ్యవధిలో రెండు రోప్‌వేలు
సాక్షి, యాదాద్రి : జిల్లాలో ఆధ్యాత్మిక, పర్యాటక రంగాలకు సరికొత్త ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి పనులను వేగవంతం చేసింది. కేంద్ర ప్రభుత్వ శ్రీపర్వతమాలశ్రీ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.1,230 కోట్లతో ఐదు రోప్‌వే ప్రాజెక్టులు మంజూరు కాగా.. అందులో యాదగిరిగుట్ట నుంచి పెద్దగుట్ట మార్గం ఒకటిగా నిలిచింది. మరోవైపు శ్రీభారత్మాలశ్రీ పథకం కింద భువనగిరి ఖిలాపైకి మంజూరైన రోప్‌వే పనులు ఇప్పటికే చురుగ్గా సాగుతున్నాయి. హైదరాబాద్ శివారులోనే ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ పర్యాటక ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడనున్నాయి.
యాదగిరిగుట్ట నుంచి పెద్దగుట్ట వరకు..
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కొలువుదీరిన ప్రధాన ఆలయం నుంచి పక్కనే ఉన్న పెద్దగుట్ట టెంపుల్ సిటీ వరకు ఈ రోప్‌వేను నిర్మించనున్నారు. గుట్టకు వచ్చే భక్తుల సౌకర్యార్థం పెద్దగుట్టలో 206 ఎకరాల్లో టెంపుల్ సిటీని ఇదివరకే అభివృద్ధి చేశారు. అక్కడ ఇప్పటికే పూలవనాలు, ల్యాండ్‌స్కేప్‌లు, విశాలమైన రహదారులను తీర్చిదిద్దారు. దాతల సహకారంతో అత్యాధునిక వసతి గృహాల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. దీనికి తోడు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేద పాఠశాల భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. అలాగే జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాల నిర్మాణాలు కూడా ఇక్కడే వేగంగా సాగుతున్నాయి.
పాతగుట్ట స్వామి దర్శనమూ సులభతరం
పెద్దగుట్టకు ఆనుకుని ఉన్న పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రధాన ఆలయం నుంచి సుమారు రెండున్నర కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న ఈ రెండు క్షేత్రాల మధ్య రోప్‌వే అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. దీనివల్ల భక్తులకు రవాణా వ్యయంతో పాటు ప్రయాణ ప్రయాసలు తప్పనున్నాయి.
భువనగిరి ఖిలాపైకి శరవేగంగా రోప్‌వే పనులు
పర్యాటక ప్రాంతమైన భువనగిరి ఖిలాపైకి రోప్‌వే నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. భారత్‌మాల పథకంలో భాగంగా కేంద్ర నిధులతో భువనగిరి ఖిలాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జాతీయ రహదారి పక్కనుంచే ఖిలా పైభాగానికి ఈ రోప్‌వేను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భువనగిరి ఖిలాను సందర్శించి రోప్‌వే పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఖిలాను సందర్శించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరగనుంది.
ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రాలుగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట, భువనగిరిల నడుమ దూరం 10 కిలోమీటర్లు మాత్రమే. యాదగిరిగుట్ట ప్రధాన ఆలయం దివ్యక్షేత్రంగా పునర్నిర్మాణం పొంది, స్వర్ణ తాపడాలు పూర్తి చేసుకున్నాక భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. విశేష పర్వదినాల్లో లక్ష మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వీరికి భక్తి పారవశ్యంతో పాటు ఆహ్లాదాన్ని పంచేందుకు పెద్దగుట్ట టెంపుల్ సిటీ, భువనగిరి ఖిలాలు ఎంతగానో ఉపయోగపడతాయి. హైదరాబాద్ మెట్రో నగరానికి సమీపంలో ఉండటంతో పర్యాటకుల రాకపోకలు నిత్యం కొనసాగుతున్నాయి. యాదగిరిగుట్ట – పెద్దగుట్ట రోప్‌వేకి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైన అనంతరం పూర్తిస్థాయి నిధుల కేటాయింపు జరగనుంది.
ఫ ఇప్పటికే శరవేగంగా సాగుతున్న భువనగిరి ఖిలా రోప్‌వే పనులు
ఫ ఆధ్యాత్మిక, పర్యాటక రంగాల అభివృద్ధితో స్థానికంగా పెరగనున్న ఉపాధి అవకాశాలు


