నీటి ఎద్దడి రానీయొద్దు | - | Sakshi
Sakshi News home page

నీటి ఎద్దడి రానీయొద్దు

Oct 18 2026 2:00 AM | Updated on Oct 18 2026 2:00 AM

సాక్షి, యాదాద్రి : రానున్న రోజుల్లో నీటి ఎద్దడి రాకుండా అధికారులు పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యాసంగి సీజన్‌ లో నీటి లభ్యత తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసేలా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఫామ్‌ పాండ్లు, ఇంకుడు గుంతలు, బోర్‌ వెల్‌ రీఛార్జి పనులను లక్ష్యం మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో తాగునీటి సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఎండలు ముదిరే నాటికి విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా విద్యుత్‌ శాఖ అధికారులు ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్వో జయమ్మ, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీపీఓ శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి జానయ్య పాల్గొన్నారు.

సమన్వయంతో

పనిచేయాలి

భువనగిరి: కేసుల్లో నేర నిరూపణ శాతం పెంచేందుకు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్‌ అన్నారు. శనివారం భువనగిరిలోని డీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో కోర్టు కేసుల పురోగతి, ఈ–సమన్ల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పాయింట్‌ బుక్స్‌ను క్రమంతప్పకుండా పరిశీలించాలన్నారు. అనంతరం రాజాపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా కృషి చేసిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కేశవరెడ్డి, విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన సీడీఓ వీరారెడ్డిని సన్మానించారు. సమావేశంలో అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు, ఎస్సైలు పాల్గొన్నారు.

పంటల సంరక్షణే ధ్యేయం

భువనగిరి: పంటల సంరక్షణే ధ్యేయమని టీజీఎస్‌పీడీసీఎల్‌ ఆపరేషన్‌ డైరెక్టర్‌ నరసింహులు అన్నారు. శనివారం బీబీనగర్‌ మండలంలోని కొండమడుగు, భట్టుగూడెం, గుర్రాలదండి, భువనగిరి మండలం బొల్లేపల్లి, సూరేపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎస్‌ఈ సురేష్‌, డీఈ వెంకటేశ్వర్లు, డీఎంఆర్‌టీ విజయభాస్కర్‌రెడ్డి, ఏడీఈలు రవీందర్‌ మచ్చేందర్‌, ఏఈ మనోహర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

యాదగిరీశుడికి

సంప్రదాయ పూజలు

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శనివారం నిత్య పూజలు విశేషంగా జరిగాయి. గర్భాలయంలోని స్వయంభూ మూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. ముఖ మండపంలోని బంగారు ఉత్సవమూర్తులకు అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం చేపట్టారు. సాయంత్రం ఆలయ తిరు, మాఢ వీధిలో జోడు సేవలను ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. అదేవిధంగా విజయ దశమిని పురస్కరించుకొని ఆలయంలో శ్రీలక్ష్మీ అమ్మవారి విశేష ఆరాధన ఉత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. ఆలయ ముఖ మండపంలోని ఉత్సవమూర్తుల చెంత శ్రీమహాలక్ష్మీ అమ్మవారి కలశ స్థాపన పూజ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement