ఫ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్రమోహన్
చౌటుప్పల్ : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్రమోహన్ సూచించారు. శనివారం చౌటుప్పల్ మండల పరిధిలోని ఆరెగూడెం గ్రామాన్ని ఆయన సందర్శించారు. పత్తిచేనులో మొక్కలకు ఉన్న పత్తి నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరికి సరిపడా నీటి లభ్యత లేనందున రైతాంగం తప్పనిసరిగా పంటల మార్పిడి చేసుకోవాలన్నారు. ఆరుతడి పంటల సాగు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రైతులు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసుకొని పట్టు పరిశ్రమ ఉత్పత్తులు, పంట ఉత్పత్తులను రైతులు స్వయంగా కొనుగోలు చేయడం ద్వారా లాభాలు అర్జించవచ్చన్నారు. పత్తి క్వింటాకు రూ.10వేలకు పెంచితే తమకు గిట్టుబాటు అవుతుందని, ధర పెంచేలా చూడాలని రైతులు విన్నవించుకున్నారు. స్పందించిన ఆయన సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయాధికారి వెంకటరమణారెడ్డి, ఉద్యానవన జిల్లా అధికారి హేమలత, మండల వ్యవసాయాధికారి ముత్యాల నాగరాజు, ఉద్యానవన అధికారి కవిత, ఏఈఓ వెన్నెల, సర్పంచ్ ఎన్నేపల్లి ధనలక్ష్మివెంకట్రెడ్డి, ఉపసర్పంచ్ నిమ్మల సత్యనారాయణ పాల్గొన్నారు.


