ప్రత్యామ్నాయ పంటలు మేలు
నల్లగొండ : ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తాగునీరు, వ్యవసాయం, విద్యుత్ తదితర రంగాల్లో సమస్యలు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ శాఖ కార్యదర్శి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రత్యేక అధికారి దాసరి హరిచందన ఆదేశించారు. శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్లో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో ఎల్నినో ప్రభావంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాల్లోని ఇప్పటికే కరువు పరిస్థితులు నెలకొన్నాయని, డిసెంబర్ చివరి నాటికి ఎల్నినో ప్రభావం తీవ్రస్థాయికి చేరే ప్రమాదముందన్నారు. దీని ప్రభావం వ్యవసాయం, భూగర్భ జలాలు, తాగునీరు, విద్యుత్ రంగాలపై పడే అవకాశం ఉన్నందన్నారు.
ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చూడాలి
ఎల్నినో పరిస్థితుల్లో తాగునీటికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని హరిచందన స్పష్టం చేశారు. నా లుగైదు నెలలపాటు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించాలని మూడు జిల్లాల కలెక్టర్లకు సూచించారు. భూగర్భ జలాల లభ్యత, బోర్లలో నీటి పరి స్థితి, గ్రామాల్లో ఉన్న నీటి ట్యాంకులు, వాటి పని తీ రును అంచనా వేసి నీటిని పొదుపుగా వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
నీటి సంరక్షణ చాలా అవసరం
భూగర్భ జలాలను పెంపొందించేందుకు వీబీజీ రాంజీ పథకం కింద పెద్ద ఎత్తున నీటి సంరక్షణ పనులు చేపట్టడం చాలా అవసరమని ఆమె అన్నారు. ప్రతి గ్రామంలో మ్యాజిక్ సోక్పిట్లు, కమ్యూనిటీ సోక్పిట్లు, నీటి నిల్వ నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. భవిష్యత్తులో భూగర్భ జలాలు తగ్గినా నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ వనరులను సిద్ధం చేసుకోవాలన్నారు. విద్యుత్ వినియోగం, నష్టాలను తగ్గించేందుకు సోలార్ విద్యుత్, సోలార్ బ్యాటరీలు, సోలార్ మోటార్లు, సూర్యఘర్ వంటి పథకాలపై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
కూలీలకు వసతులు కల్పించండి
వీబీజీ రాంజీ పథకం కింద ఉపాధి పనులు జరిగే ప్రాంతాల్లో కూలీలకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స సౌకర్యాలు, నీడ కల్పించాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు ప్రతి వారం పరిస్థితులను సమీక్షించి గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. అనంతరం యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లాలో వ్యవసాయం, భూగర్భ జలాలు, విద్యుత్, తాగునీరు, పశుగ్రాసం, సాగునీటి పరిస్థితులను వివరించారు.
రబీ సీజన్లో రైతులు వరికి బదులుగా తక్కువ నీటితో పండించే పెసర్లు, ఉలవలు, కందులు, ఉద్యాన పంటలు సాగుచేసేలా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. నీరు, విద్యుత్ పొదుపునకు సూక్ష్మ సేద్యం కింద బిందు, తుంపర సేద్య పద్ధతులను ప్రోత్సహించేలా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. పశువులకు తాగునీరు, పశుగ్రాసం కొరత రాకుండా ప్రతి గ్రామంలో వనరులను గుర్తించాలని ఆదేశించారు.
ఫ తాగునీటి సరఫరాకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి
ఫ రబీలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి
ఫ గ్రామాల వారీగా కార్యాచరణ సిద్ధం చేయండి
ఫ నల్లగొండలో జరిగిన సమీక్షలో ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి దాసరి హరిచందన


