యాసంగిపై కరువు పడగ! | - | Sakshi
Sakshi News home page

యాసంగిపై కరువు పడగ!

Oct 17 2026 8:24 AM | Updated on Oct 17 2026 8:24 AM

మూసీయేతర ప్రాంతాల్లోనే అధిక తగ్గుదల

సాక్షి, యాదాద్రి : తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో యాసంగి సాగు అంచనాలు భారీగా పడిపోయాయి. ఒకవైపు కరువు ఛాయలు, మరోవైపు అడుగంటిన భూగర్భ జలాలతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. జిల్లా వ్యాప్తంగా 22 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా.. 14 మండలాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రణాళికలు రచిస్తున్నప్పటికీ.. రైతులు అటువైపు ఏ మేరకు మొగ్గు చూపుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. మూసీ ఆయకట్టు కింద కూడా వరి విస్తీర్ణం భారీగా తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

సగానికి పైగా తగ్గనున్న వరి సాగు..

జిల్లాలో 2026–27 యాసంగి పంటల ప్రణాళిక రైతుల భవిష్యత్తుపై కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది. గత యాసంగిలో 3,70,309 ఎకరాలుగా ఉన్న మొత్తం పంటల సాగు విస్తీర్ణాన్ని ఈసారి కేవలం 1,78,564 ఎకరాలుగా అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా వరి సాగు ఒక్కటే 3,46,454 ఎకరాల నుంచి 1,31,500 ఎకరాలకు పడిపోతుందని భావిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో తగ్గుదల అంచనా వేసిన అధికారులు.. రైతులకు లాభదాయకమైన ప్రత్యామ్నాయ మార్గాలను స్పష్టంగా చూపలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పంట మార్పిడా.. సాగుకే విరామమా?

ప్రణాళిక ప్రకారం వరి విస్తీర్ణం ఏకంగా 2,14,954 ఎకరాలు తగ్గనుండగా.. వరియేతర వ్యవసాయ పంటల విస్తీర్ణం 2,147 ఎకరాల నుంచి 25,655 ఎకరాలకు పెరుగుతుందని అంచనా వేశారు. అంటే ప్రత్యామ్నాయ పంటల్లో పెరుగుదల కేవలం 23,508 ఎకరాలుగా మాత్రమే లెక్కకట్టారు. ఉద్యాన పంటల విస్తీర్ణం కూడా మొత్తంగా 299 ఎకరాలు తగ్గుతుందని పేర్కొన్నారు. ఫలితంగా గత సీజన్‌తో పోలిస్తే ఈసారి ఏకంగా 1,91,745 ఎకరాల మేర సాగు విస్తీర్ణం తగ్గనుంది. ఆ మేరకు భూములను రైతులు బీడుగా వదిలేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

ప్రత్యామ్నాయ విత్తన ప్రణాళిక సరిపోతుందా..

పెసర 5,410 ఎకరాలు, మినుము 3,560, వేరుశనగ 1,675, శనగ 1,200 ఎకరాల్లో సాగవుతుందని అధికారులు నివేదిక రూపొందించారు. కానీ, ప్రభుత్వం వద్ద సమర్పించిన సబ్సిడీ విత్తన ప్రతిపాదనల్లో పెసరకు 5,704 ఎకరాలు, వేరుశనగకు 1,620 ఎకరాలు, శనగకు 1,985 ఎకరాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. కుసుమ సాగు అంచనా 1,020 ఎకరాలుగా ఉంది. గత సీజన్‌లో ఆయిల్‌పామ్‌ విస్తీర్ణం 5,159 ఎకరాలు కాగా, ఉద్యాన పంటల పట్టికలో ఈసారి 4,368 ఎకరాలుగా నమోదైంది.

రైతుల సందిగ్ధం..

యాసంగి సీజన్‌లో జిల్లాలో సహజంగానే అత్యధికంగా వరి సాగు చేస్తారు. ఆ తర్వాత కూరగాయల సాగు ఉంటుంది. మూసీ ఆయకట్టు ప్రాంతమంతా వరి సాగుపైనే ఆధారపడుతుంది. ఇక నాన్‌–మూసీ ఆయకట్టులో భూగర్భ జలాలపై ఆధారపడి వరి వేస్తారు. కానీ, ఈసారి భూగర్భ జలాలు దారుణంగా పడిపోవడంతో రైతులు ఏ పంట వేయాలన్న సందిగ్ధంలో ఉన్నారు. ప్రభుత్వం చెబుతున్న ప్రత్యామ్నాయ పంటల సాగు కూడా ప్రశ్నార్థకమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సగానికి పైగా పడిపోయిన పంట సాగు అంచనాలు

ఫ వరి 1,31,500 ఎకరాలకు

పడిపోతుందని భావిస్తున్న అధికారులు

ఫ రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపేనా?

ఫ విత్తన ప్రణాళికపై వీడని సందిగ్ధత

మూసీ ఆయకట్టు మండలాలైన పోచంపల్లి, బీబీనగర్‌, రామన్నపేట, వలిగొండ మండలాల్లో వరి విస్తీర్ణం 1,18,021 ఎకరాల నుంచి 81,000 ఎకరాలకు తగ్గుతుందని అంచనా. సెమీ మూసీ ప్రాంతంలోని అడ్డగూడూరు, భువనగిరి, చౌటుప్పల్‌ మండలాల్లో 57,971 ఎకరాల నుంచి 18,000 ఎకరాలకు సాగు పరిమితం కానుంది. మూసీయేతర ప్రాంతంలోని పది మండలాల్లో అత్యధికంగా వరి సాగు 1,70,463 ఎకరాల నుంచి కేవలం 32,500 ఎకరాలకు పడిపోతుందని భావిస్తున్నారు. ఇందులో ఆత్మకూరు(ఎం)లో 24,925 ఎకరాల నుంచి 3,500 ఎకరాలకు, రాజాపేటలో 21,852 నుంచి 5,000 ఎకరాలకు, మోటకొండూరులో 19,378 నుంచి 3,000 ఎకరాలకు వరి సాగు భారీగా తగ్గనుందని అంచానా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement