భువనగిరి (భువనగిరిటౌన్) : పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి నవంబర్, డిసెంబర్లో పెద్దఎత్తున ఆందోళనలు కార్యాక్రమాలు చేపట్టనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ వెల్లడించారు. స్థానిక సుందరయ్య భవనంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ అధ్యక్షతన నిర్వహించిన భూ సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలో పేదలకు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా భూ పంపిణీ చేయకపోవడం దారుణమన్నారు. బసవపురం ప్రాజెక్టు నిర్వాసితులకు, గౌరెల్లి, భద్రాచలం రోడ్డు బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించలేదని ఆరోపించారు. మోటకొండూరు మండలం మాటూరులో 65 మంది దళితులకు పాస్ పుస్తకాలు ఇవ్వకపోవడం, వక్ఫ్ భూముల పరిరక్షణలో అలసత్వం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదస్సులో నాయకులు బట్టుపల్లి అనురాధ, కల్లూరి మల్లేశం, దాసరి పండు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, ఎంఏ ఇక్బాల్, గంగాదేవి సైదులు, గడ్డం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. ఆలయ మండపంలో ఆండాళ్ దేవిని విశేషంగా అలంకరించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేక సేవపై అధిష్టించి ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. ఆండాళ్ అమ్మవారికి అద్దాల మండపంలో ఊంజల్ సేవోత్సవం జరిపించారు. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు నిత్య కై ంకర్యాలు నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
ప్రభుత్వ అసమర్థ
విధానాల వల్లే కరువు
సాక్షి,యాదాద్రి: రాష్ట్రంలో కరెంటు కోతలు తీవ్రమై, వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, దీనికి పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వపు అసమర్థ విధానాలే కారణమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. శుక్రవారం భువనగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కనీసం 5, 6 గంటల కరెంటు కూడా ఇవ్వకపోవడం వల్లే వేల ఎకరాల పంటలు నీరులేక ఎండిపోతున్నాయన్నారు. ఇది ఎల్నినో వల్లనో, ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు, సరైన ఆలోచన లేకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను రద్దు చేయడం వల్ల రాష్ట్రంలో వేలాది మంది ఉపాధి కోల్పోయారని, బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఎనబోయిన ఆంజనేయులు, ఏవీ కిరణ్, రచ్చ శ్రీనివాస్రెడ్డి, కేశపట్నం రమేష్, సబ్బురు మల్లయ్య, రేకల శ్రీనివాస్ పాల్గొన్నారు.


