సెలవుల్లో ఆడుతూ.. పాడుతూ.. నేర్చుకుంటూ.. | - | Sakshi
Sakshi News home page

సెలవుల్లో ఆడుతూ.. పాడుతూ.. నేర్చుకుంటూ..

Oct 17 2026 8:24 AM | Updated on Oct 17 2026 8:24 AM

భువనగిరి: దసరా సెలవులు వచ్చాయంటే చాలు.. విద్యార్థులు టీవీలు, మొబైల్‌ ఫోన్లకు అతుక్కుపోతారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, వారు కొత్త విషయాలు నేర్చుకునేలా రాష్ట్ర విద్యాశాఖ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. తరగతి గదిలో నేర్చుకున్న విజ్ఞానానికి తోడుగా, భవిష్యత్తుకు అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్‌ లెర్నింగ్‌పై పట్టు సాధించేందుకు వీలుగా ఇందులో పలు రకాల అభ్యసన కార్యక్రమాలను పొందుపరిచారు.

అదనపు నైపుణ్యాలపై దృష్టి

భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 715 పాఠశాలల్లో సుమారు 42,196 మంది విద్యార్థులు చదువుతున్నారు. దసరా సెలవుల్లో వీరు పుస్తకాలను పక్కనపెట్టి సందడి చేస్తున్నారు. ముఖ్యంగా 4 నుంచి 10వ తరగతి చదువుతున్న పిల్లలు, ఈ సెలవుల్లో కొంత సమయాన్ని కేటాయించి కొత్త నైపుణ్యాలు పెంపొందించుకోవాలనే లక్ష్యంతో విద్యాశాఖ ఈ డిజిటల్‌ వేదికను అందుబాటులోకి తెచ్చింది.

ఆటలతో పాటు ఏఐ, కోడింగ్‌

డిజిటల్‌ లెర్నింగ్‌తో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ను ఉపయోగించి కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టేలా ఈ పోర్టల్‌ను తీర్చిదిద్దారు. కోడింగ్‌లో ప్రాథమిక నైపుణ్యాలు, డేటా ఫండమెంటల్స్‌, వివిధ రకాల గేమ్స్‌, డిజైన్లు చేసేందుకు అవసరమైన పాఠాలను ఇందులో పొందుపరిచారు. అలాగే గణితం, భౌతికశాస్త్రం (ఫిజిక్స్‌)కు సంబంధించిన కాన్సెప్ట్‌లు, సమస్యలను సాధన చేసే విధానాలను కూడా రూపొందించారు. భవిష్యత్తులో విద్యార్థులు రాయబోయే జేఈఈ, నీట్‌ వంటి పోటీ పరీక్షలకు అవసరమైన ప్రాథమిక సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఈ ప్రాక్టీస్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

విస్తృత ప్రచారం కల్పించాలి

విద్యార్థులు ఆనందంగా కొత్త విషయాలను సెలవుల్లో నేర్చుకునేందుకు విద్యాశాఖ ఇచ్చిన సంబంధిత వెబ్‌సైట్‌ లింక్‌ను ఓపెన్‌ చేసి, తమ పిన్‌ నంబర్‌తో లాగిన్‌ అయి ఈ అంశాలను సాధన చేయవచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలు, పాఠశాలల ఉపాధ్యాయులు తరగతుల వారీగా ఉన్న విద్యార్థుల వాట్సాప్‌ గ్రూపుల్లో విస్తృత ప్రచారం కల్పించి, వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

ఫ విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు విద్యాశాఖ ప్రత్యేక పోర్టల్‌

ఫ 4 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం రూపకల్పన

ఫ ఆటల ద్వారా ఏఐ, కోడింగ్‌, డిజిటల్‌ నైపుణ్యాల అభ్యసనం

ఫ జేఈఈ, నీట్‌ లాంటి పోటీ పరీక్షలకు పునాది పడేలా పాఠాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement