చౌటుప్పల్ : దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు సొంతూళ్లకు బయల్దేరడంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి గురువారం వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో విజయవాడ మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్ అయ్యింది. ముఖ్యంగా చౌటుప్పల్ మండల పరిధిలోని ధర్మోజిగూడెం నుంచి చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లింగోజిగూడెం శివారు వరకు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు బారులుదీరాయి. ఈ ఐదు కిలోమీటర్ల దూరం దాటేందుకు వాహనదారులకు గంట సమయం పట్టింది. బంపర్ టు బంపర్ వాహనాలు వెళ్తుండడంతో వాహనదారులు నరకయాతనకు గురయ్యారు. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన వాహనాల రద్దీ రాత్రి వరకు కొనసాగింది. ఈ రద్దీ కారణంగా హైవేపై చిన్నచిన్న రోడ్డు ప్రమాదాలు సైతం చోటుచేసుకున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే గురువారం జాతీయ రహదారిపై వాహనాల రద్దీ రెండింతలు పెరిగినట్లు సమాచారం. వాహనాల రద్దీకి అనుగుణంగా పంతంగి టోల్‌ప్లాజా వద్ద నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఈ రద్దీ కారణంగా వాహనదారులు, ప్రయాణీకులు, వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఫ హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌జామ్
ఫ ధర్మోజిగూడెం నుంచి చౌటుప్పల్ వరకు వాహనాల బారులు


