నకిరేకల్(కట్టంగూర్) : వర్షాలు పడక, లోఓల్టేజీ, విద్యుత్ కోతలతో పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. గురువారం కట్టంగూర్ మండలం కురుమర్తి గ్రామంలో ఎండిపోయిన వరి చేలను ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిరేకల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించి వరికి ఎకరానికి రూ.25వేలు, పత్తికి ఎకరానికి రూ.20 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు నాణ్యమైన విద్యుత్, సాగునీరు అందించటతో పంటలు సమృద్ధిగా పండాయని గుర్తుచేశారు. ప్రస్తుతం విద్యుత్ సరఫరాలో అంతరాయం, లో ఓల్టేజీతో విద్యుత్ మోటార్లు కాలిపోవడంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయినా పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పెట్టుబడుల కోసం అప్పులు చేసిన రైతులు పంటలు ఎండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తరాల బలరాములుయాదవ్, గడుసు కోటిరెడ్డి, పోగుల నర్సింహా, పెద్ది బాలనర్సింహా, బీరెల్లి ప్రసాద్, గుండగోని రాములు, కొంపెల్లి సైదులు, బోడ యాదగిరి, అంతటి శ్రీను ఉన్నారు.
ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య


