మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ప్రైవేట్ వాహనాల డ్రైవర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. బస్టాండ్ ముందే ప్రైవేట్ వాహనాలు, కార్లను నిలుపుతుండటంతో ఆర్టీసీ బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. బుధవారం రాత్రి బస్టాండ్ ఎదుట ప్రైవేట్ వాహనాలు నిలపవద్దని చెప్పిన ఆర్టీసీ డ్రైవర్‌పై ప్రైవేట్ కారు డ్రైవర్ దాడికి దిగాడు. వివరాలు.. ఆర్టీసీ డ్రైవర్ మొర్సు శంకరయ్య బుధవారం రాత్రి బస్టాండ్ వద్ద విధుల్లో ఉన్న సమయంలో ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఒక ఎర్టిగా కారు వచ్చింది. బస్టాండ్ ఎదుట కాకుండా కొంచెం ముందుకు వెళ్లి కారును నిలపాలని కోరగా.. ఆ కారు డ్రైవర్ దుర్భాషలాడుతూ తనపై దాడి చేశాడని శంకరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ టూటౌన్ సీఐ సోమనర్సయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ ఆదాయానికి గండి.. ట్రాఫిక్ ఇబ్బందులు
పండుగలు, ఇతర సమయాల్లో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రైవేట్ వాహనాలను ఆర్టీసీ బస్టాండ్ ముందే నిలిపి ఉంచుతున్నారు. బస్టాండ్‌లోకి వెళ్లే ప్రయాణికులను దారి మళ్లించి ప్రైవేట్ వాహనాల్లో హైదరాబాద్‌కు తరలిస్తూ ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్నారు. అంతేకాకుండా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రైవేట్ వాహనాలు ఆపుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు కోరుతున్నారు.
ఫ ప్రైవేట్ వాహన డ్రైవర్‌పై
పోలీసులకు ఫిర్యాదు


