మద్యం మహమ్మారిపై ప్రజల సమరశంఖం | - | Sakshi
Sakshi News home page

మద్యం మహమ్మారిపై ప్రజల సమరశంఖం

Oct 14 2026 11:10 AM | Updated on Oct 14 2026 11:10 AM

సాక్షి, యాదాద్రి: పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్న మద్యం మహమ్మారిపై ప్రజలు, మహిళలు, యువత ఏకమై సమరశంఖం పూరిస్తున్నారు. బెల్టుదుకాణాలు మూసివేయాలని పలు గ్రామాల్లో డిమాండ్‌ చేస్తున్నారు. ఈనేపథ్యంలో జిల్లాలోని కొన్ని గ్రామాల్లో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ పంచాయతీలు తీర్మానాలు చేస్తున్నాయి. మద్యం విక్రయిస్తే జరిమానాలు సైతం విధిస్తామని హెచ్చరిస్తున్నాయి. పాలకవర్గాల నిర్ణయాలను విధిగా పాటిస్తూ పల్లెలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

మద్యం వ్యాపారుల అడ్డంకులు

బెల్టు షాపుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోతున్నామనే అక్కసుతో మద్యం వ్యాపారులు కొందరిని రెచ్చగొడుతున్నారు.ఊర్లలోని కొందరి వ్యక్తుల ద్వారా గ్రామాల్లో ఉద్రిక్తతలు సృష్టిస్తూ, రహస్యంగా మద్యం విక్రయాలు జరిగేలా ఒత్తిడి తెస్తున్నారు.అయితే, ఎంతటి ఒత్తిళ్లు ఎదురైనా కొన్ని గ్రామ పంచాయతీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకాలకు తావులేదని తేల్చిచెబుతున్నాయి.

–ఆలేరు మండలం కొలనుపాకలో 30కిపైగా బెల్టుదుకాణాలు ఉన్నాయి. ఒక వైన్స్‌ ఉంది. బెల్ట్‌ షాపులు నిషేధించాలని జూలై 27న గ్రామపంచాయతీ తీర్మానం చేసింది. దీనిని ఆగస్టు 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అధికారుల నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో బెల్టు షాపులు నిషేధించాలని కోరుతూ ఎకై ్సజ్‌, పోలీస్‌ శాఖల అధికారులతో పాటు కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఎకై ్సజ్‌ అధికారులు సహకరించడంలేదని ఆలేరులోని ఆ శాఖ కార్యాలయం ముందు ధర్నా కూడా చేశారు. కాగా ఎకై ్సజ్‌ అధికారులు ఇటీవల బెల్టుదుకాణాల్లో మద్యం అమ్మకాలను అడ్డుకుంటన్నారని గ్రామ సర్పంచ్‌ బెదరబోయిన యాకమ్మ వెంకటేశ్‌లు తెలిపారు.

● బీబీనగర్‌ మండలంలోని రాఘవపురంలో సెప్టెంబర్‌ 26న మహిళాసంఘాల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సహకారంతో గ్రామ సభ ఏర్పాటు చేసి మద్యం విక్రయాలపై తీర్మానించారు.

● భూదాన్‌ పోచంపల్లి మండలంలో కప్రాయిపల్లి, కనుముక్కుల గ్రామాలలో గాంధీ జయంతి గ్రామ సభలలో మద్యం విక్రయాలను నిషేధిస్తూ తీర్మాణం చేసుకున్నారు.

● సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని అన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆదేశాల మేరకు రెండున్నరేళ్ల నుంచి బెల్ట్‌ షాపులు మూసివేశారు. ప్రతి గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధించారు. మండలం కేంద్రంలోని రెండు వైన్‌ షాపులు, సర్వేల్‌లోని మరొక వైన్‌ షాప్‌ కూడా ఉదయం తెరవాల్సినప్పటికీ ఎమ్మెల్యే సూచనల మేరకు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతనే ఓపెన్‌ చేస్తారు. సాయంత్రం వరకు సిట్టింగ్‌కు కూడా పర్మిషన్‌ లేదు. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు సిట్టింగ్‌ పర్మిషన్‌. బెల్ట్‌ షాప్‌ అనేది లేదు.

ఫ బెల్టు షాపుల నిషేధానికి పలు గ్రామపంచాయతీల్లో తీర్మానం

ఫ ఆదర్శంగా నిలుస్తున్న పల్లెలు

యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌పేటలో మద్యం అమ్మకాలు పూర్తిగా నిషేధిస్తున్నట్లు, గ్రామపంచాయతీ పాలకవర్గం సోమవారం గ్రామ సభలో తీర్మానం చేసింది. మద్యం షాపుల నిర్వాహకులు నిబంధలు ఉల్లంఘిస్తే రూ. 20వేల జరిమానా విధిస్తామని నిర్ణయం తీసుకుంది.

భువనగిరి మండలంలో తుక్కాపురం గ్రామంలో తొమ్మిదేళ్లుగా మద్యం విక్రయాలపై నిషేధం అమల్లో ఉంది. గ్రామంలో మద్యాన్ని విక్రయించిన వారికి రూ. లక్ష వరకు జరిమానా విధిస్తామని మహిళాసంఘాలు, యువజన సంఘాలు, గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. నాటి నుంచి నేటి వరకు వరకు గ్రామంలో మద్యం విక్రయాలు జరగడం లేదు.

వలిగొండ మండలం సుంకిశాలలో మద్యం విక్రయాలపై పదేళ్ల క్రితం నిషేధం విధిస్తూ స్థానికులంతా ఏకమై నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ విక్రయిస్తే రూ.50వేలు జరిమానా విధిస్తామని నిర్ణయించారు. అప్పటి నుంచి మద్యం విక్రయాలపై నిషేధం కొనసాగుతూనే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement