సాక్షి, యాదాద్రి: ఎల్ నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర కరువు ఛాయలు అలుముకున్నాయి. వానాకాలం సీజన్‌లో కనీసం సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో.. తరి, మెట్ట పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి, పత్తి, కంది తదితర పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోగా.. సాగైన పంటలు సైతం వర్షాలు లేక దెబ్బతిన్నాయి. పొట్ట దశలో ఉన్న వరి పంట నీరందక ఎండిపోతోంది. మరోవైపు భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో గ్రామాల్లో మంచినీటి బోర్లు ఎండిపోయి, సాగునీటికే కాక.. తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
కరువు అంచనాల్లో యంత్రాంగం..
జిల్లాలో కరువు నష్టాన్ని అంచనా వేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 17 మండలాలకు సుమారు 13 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్లు గుర్తించి, రాష్ట్ర యంత్రాంగం కేంద్రానికి నివేదిక పంపించింది. ఈ వానాకాలం సీజన్‌లో జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నమోదైన లోటు వర్షపాతం, అలాగే డ్రై స్పెల్ (రెండు వర్షాల మధ్య 15 రోజుల సుదీర్ఘ విరామం), సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడం వంటి అంశాలను ప్రాతిపదికన తీసుకుని కరువును లెక్కిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర కరువు బృందాలు త్వరలో రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బృందం రాకకంటే ముందే.. వ్యవసాయ, భూగర్భ జలవనరులు, రెవె న్యూ, పంచాయతీరాజ్, ప్లానింగ్ శాఖల అధికారులు నివేదికలను సిద్ధం చేయనున్నారు.
పత్తి రైతులపై తీవ్ర ప్రభావం
వర్షాభావ పరిస్థితులు పత్తి పంటపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత ఏడాది ఎకరాకు 6 నుంచి 10 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి రాగా.. ప్రస్తుతం 40 నుంచి 60 కిలోలకు పడిపోయింది. వర్షాలు అనుకూలించక రైతులు రెండు, మూడుసార్లు పత్తి విత్తనాలు వేయాల్సి రావడంతో పెట్టుబడులు పెరిగి నష్టాలపాలయ్యారు.
ఐదు మండలాల్లోనే సాధారణం
వానాకాలం సీజన్‌లో తుర్కపల్లి, ఆత్మకూరు (ఎం), మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా.. బీబీనగర్, భువనగిరి మండలాల్లో అత్యధిక లోటు వర్షపాతం రికార్డైంది.
ఫ కురవని వానలు.. ఎండుతున్న పత్తి, వరి, కంది పంటలు
ఫ 17 మండలాలకు గాను 13 మండలాల్లో వర్షాభావం
ఫ 10.58 మీటర్ల లోతుకు పడిపోయిన భూగర్భ జలాలు
ఫ భారీగా తగ్గిన పంటలసాగు విస్తీర్ణం
ఫ అప్పుల ఊబిలో రైతులు
సంస్థాన్‌నారాయణపురం మండలం జనగాంకు చెందిన రైతు బైకని యాదయ్య తనకున్న 8 ఎకరాలతో పాటు మరో 70 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. సరైన వర్షాలు లేక విత్తిన ప్రతీసారి మొలకలు రాకపోవడంతో మూడుసార్లు విత్తనాలు వేశాడు. మొత్తం రూ.22లక్షలు పెట్టుబడి పెట్టాడు. వానలు లేక పత్తి మొక్కలకు ఒకటి, రెండు కాయలే వచ్చాయి. గతేడాది ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈసారి కనీసం ఎకరాకు 50–60 కిలోలకు మించి దిగుబడి రావడం లేదు. ఏరితే కూలీల ఖర్చు కూడా రాదని వదిలేశాడు. భూమిని బట్టి ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు కౌలు చెల్లించాలి. పరిస్థితి చూస్తే అప్పులే మిగిలేలా ఉన్నాయి.


