సాక్షి, యాదాద్రి: భువనగిరిలోని ఓ రైస్ మిల్లులో భారీ స్థాయిలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ధాన్యం పక్కదారి పట్టిన ఘటన వెలుగుచూసింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు బుధవారం అర్ధరాత్రి వరకు భువనగిరిలోని శివ పార్‌బాయిల్డ్ రైస్ మిల్లులో సివిల్ సప్లయ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.18.40 కోట్ల విలువ చేసే ధాన్యం బస్తాల లెక్కల్లో భారీ వ్యత్యాసాన్ని అధికారులు గుర్తించారు.
తనిఖీల్లో వెలుగుచూసిన అక్రమాలు
2025–26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శివ పార్‌బాయిల్డ్ రైస్ మిల్లుకు మొత్తం 12,739 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ కోసం కేటాయించింది. అయితే, మిల్లు యాజమాన్యం కేవలం 2,882 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే ప్రభుత్వానికి సీఎంఆర్ కింద అప్పగించింది. పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారులు రోజారాణి, హరికృష్ణలతో పాటు మరో ఆరుగురు సభ్యుల తో కూడిన ప్రత్యేక బృందం మిల్లులోని రికార్డులను, భౌతిక నిల్వలను పరిశీలించింది. నిల్వ ఉండాల్సిన దానికంటే 6,302 మెట్రిక్ టన్నుల వడ్లు (సుమారు 1,57,575 బస్తాలు) తక్కువగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. పక్కదారి పట్టిన ఈ ధాన్యం విలువ సుమారు రూ. 18.40 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. దీనిపై మిల్లు యజమాని గంపా నాగేంద్ర నోటీసు జారీ చేశారు. మిల్లు పార్ట్‌నర్‌లకు కూడా నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటికే రెండు మిల్లుల్లో తేడా
జిల్లాలోని రెండు మిల్లుల్లో ఇప్పటికే ధాన్యంలో భారీగా తేడాలు ఉన్నట్లు సివిల్ సప్లయ్ అధికారులు గుర్తించారు. భువనగిరి పట్టణంలోని యాదాద్రి ఆగ్రో ఇండస్ట్రీస్‌లో రూ.24 కోట్ల విలువైన ధాన్యం లోటును గుర్తించి, యజమానులపై కేసులు నమోదు చేసి కొందరిని అరెస్ట్ చేశారు. అలాగే, రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలోని విద్యా ఆగ్రోస్ రైస్ ప్రొడక్ట్‌లో ఏకంగా రూ. 33.60 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు తేల్చారు.
ఫ భువనగిరిలోని శివ పార్‌బాయిల్డ్ రైస్ మిల్లులో సివిల్ సప్లయ్ అధికారుల తనిఖీలు
ఫ 6,302 మెట్రిక్ టన్నుల వడ్లు మాయం
ఫ మిల్లు యజమానికి నోటీసులు జారీ


