ఓటుపై టెన్షన్
సాక్షి, యాదాద్రి: సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి అభ్యంతరాల స్వీకరణ గడువు బుధవారంతో ముగిసింది. హియరింగ్‌కు హాజరైన ఓటర్లు తమ వివరాలను అధికారులకు అందించారు.ఇక ఫారం 6, 7, 8 ద్వారా దరఖాస్తు చేసుకున్న ఓటర్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది. వచ్చేనెల 9 వ తేదీన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు.
4.59 లక్షల మంది ఓటర్లు
సర్ ప్రక్రియ అనంతరం ఆగస్టు 17వ తేదీన జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో 4.59 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 97,102 మంది ఓటర్లకు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేశారు. వీరిలో 92,968 మంది హియరింగ్ కు హాజరుకాగా మరో 4,060 మంది గైర్హాజరయ్యారు. ఏఎస్‌డీ ఓటర్లు 305 మంది ఉన్నారు. వీరిలో డబుల్ ఓటర్లు, చనిపోయిన వారు, స్థానికంగాలేని వారు ఉండడంతో హియరింగ్ కు హాజరు కాలేక పోయినట్లు తెలుస్తోంది. హియరింగ్‌కు హాజరుకాని వారి వివరాలను సేకరిస్తామని ఎన్నికల అఽధికారులు చెబుతున్నారు.
దరఖాస్తులను పరిశీలించి..
జిల్లాలో సమగ్ర ఓటరు ప్రత్యేక సవరణ ప్రక్రియ ముగియడంతో 18 ఏళ్లు నిండిన వారికి కొత్త గా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ముసాయిదా జాబితాలో చోటు లేని ఓటర్లు సైతం కొత్తగా ఓటు హక్కు కోసం ఫామ్ – 6 ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఓటు హక్కు తొలగింపు కోసం ఫామ్ – 7, ఓటరు వివరాల సవరణకు ఫారం– 8 సమర్పించారు. ఈ గడువు సైతం బుధవారం అర్ధరాత్రితో ముగిసింది. వీరి దరఖాస్తులను పరిశీలించి అర్హులకు ఓటు హక్కు కల్పించనున్నారు. చివరగా నవంబర్ 9వ తేదీన తుది ఓటరు జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు.
ఫ ప్రారంభం కానున్న ఫారం 6, 7, 8 దరఖాస్తుల పరిశీలన
ఫ చివరి దశకు సమగ్ర ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ
ఫ నవంబర్ 9న తుది ఓటరు జాబితా
ఎస్‌ఐఆర్ నేపథ్యంలో ఓటర్లలో టెన్షన్ నెలకొంది. ఓట్లు తొలగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో తమ ఓటు ఉంటుందా ... లేదా అన్న అనుమానం ఓటర్లు వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో బీఎల్‌వోలను కలిసి ఓటు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. తుది జాబితా వచ్చే వరకు ఓటర్లలో ఎడతెగని ఆసక్తి కొనసాగుతోంది.


