రామన్నపేట, ఆలేరు రూరల్: వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలోని 9 మండలాల్లో తీవ్ర కరువు నెలకొంది. వ్యవసాయ బోర్లు వట్టిపోవడం, వేసిన పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. సాగు పనులు లేక వ్యవసాయ కూలీలతో పాటు, చిన్న, కౌలు రైతులు సైతం ఉపాధి కోల్పోయారు. ఉపాధి లేక వలసల బాట పడుతున్న ఈ వర్గాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఉపాధి పథకం ద్వారా కోరుకున్న ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
కొత్త కార్డుల జారీ
కరువు ప్రభావిత ప్రాంతాల్లోని నిరుపేదలకు అండగా నిలిచేందుకు వీబీ జీరామ్‌జీ (ఉపాధి హామీ) పథకం కింద కొత్త జాబ్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను ఆదేశించింది. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా వీటిని విధిగా మంజూరు చేయాలి. 18 ఏళ్లు నిండిన వారు తమ దరఖాస్తు ఫారానికి ఆధార్ కార్డు నకలు, ఫొటోను జతచేసి సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శికి అందజేయాల్సి ఉంటుంది.
ఉపాధి కల్పనే లక్ష్యం
ప్రస్తుతం ఉన్న జాబ్‌కార్డులతో పాటు కొత్తగా చేరే వారిని కలుపుకొని, ప్రతి గ్రామంలో కనీసం 100 నుంచి 150 మందికి ప్రతిరోజూ పని కల్పించాలని ప్రభుత్వం నిర్దేశించింది. జిల్లాలో ప్రస్తుతం 2,61,745 జాబ్ కార్డులు ఉండగా, కరువు దృష్ట్యా దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరికీ కార్డు అందజేసి, జిల్లా వ్యాప్తంగా ఉపాధి పొందే కూలీల సంఖ్యను 3,04,445 కు పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఫ 18 ఏళ్లు నిండిన వారు అర్హులు
ఫ కరువు నేపథ్యంలో వలసల నివారణే లక్ష్యం
ఫ ప్రతి గ్రామంలో రోజుకు 100 నుంచి 150 మందికి వీబీజీరామ్‌జీ పథకం కింద పనులు


