కట్టంగూర్ : రైతులకు సాగునీరు, నాణ్యమైన విద్యుత్ అందించటంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. బుధవారం కట్టంగూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగానికి 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ప్రభుత్వం ప్రకటన చేస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ఐదారు గంటలు కూడా రావడం లేదన్నారు. రైతులకు కనీసం 12 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా ఇవ్వాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వచ్చే ఏడాది మే వరకు సాగునీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఎమ్మార్పీ నీటితో ఆయకట్టు గ్రామాలలో చెరువులు, కుంటలను నింపి రైతులు సాగు చేసిన బత్తాయి, నిమ్మ, ఆయిల్‌ఫాం తోటలను కాపాడాలన్నారు. బీఆర్‌ఎస్ నాయకులపై రాజకీయ కక్ష సాధింపు ధోరణి వీడి, ప్రజా సమస్యలపై పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ తరాల బలరాములు, నాయకులు పోగుల నర్సింహ, పెద్ది బాలనర్సింహ, సర్పంచ్ బెల్లి సుధాకర్, బీరెళ్ళి ప్రసాద్, నోముల వెంకటేశ్వర్లు, యాదయ్య, జనార్దన్, అంజయ్య పాల్గొన్నారు.
ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య


