మోత్కూరు : మండలంలోని దత్తప్పగూడెంకి చెందిన అక్కెనపల్లి రఘురామ్‌రావు ప్రతిష్టాత్మక ఫార్మారత్న పురస్కారానికి ఎంపికయ్యారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 27న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారం అందుకోనున్నారు. రఘురామ్‌రావు ప్రస్తుతం నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఫార్మసీ సైన్సెస్ కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
గ్యాస్ లీకై పూరిల్లు దగ్ధం
మునగాల : మండలంలోని కలకోవ గ్రామంలో బుధవారం గ్యాస్ లీకై పూరిల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన చిర్రా గురవయ్య వ్యవసాయ కూలీగా పనిచేస్తూ పూరి గుడిసెలో నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య.. కుమార్తె ఇంటికి వెళ్లగా, బుధవారం గురవయ్య టీ పెట్టుకునేందుకు గ్యాస్ స్టవ్ వెలిగించాడు. ఈ క్రమంలో గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగి పూరిల్లు కాలిబూడిదైంది. నిత్యావసర సరుకులతో పాటు దుస్తులు, బీరువా పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.2.50లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. తన కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలని గురవయ్య వేడుకుంటున్నాడు.
బైక్ అదుపుతప్పి గాయాలు
నిడమనూరు : ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. నిడమనూరుకు చెందిన పోలె గిరి ద్విచక్ర వాహనంపై స్థానిక వైకుంఠధామం వద్ద యూటర్న్ తీసుకుంటుండంగా అదపుతప్పి కిందపడిపోవడంతో గాయపడ్డాడు. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
కుటుంబ సమస్యలతో మహిళ ఆత్యహత్య
మఠంపల్లి : కుటుంబ సమస్యలతో మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మఠంంపల్లి మండలం చౌటపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటపల్లికి చెందిన శీలం అంజలి(35)కి హుజూర్‌నగర్ మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన శీలం సురేష్‌తో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే సురేష్ అనారోగ్యానికి గురై కొద్ది సంవత్సరాలుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. దీంతో అంజలి పిల్లలతో కలిసి తన పుట్టినిల్లు చౌటపల్లికి వచ్చి జీవనం సాగిస్తోంది. కాగా కుటుంబ పోషణ భారంగా మారడంతో మనస్తాపానికి గురైన ఆమె బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించి మఠంపల్లి పీహెచ్‌సీకి.. అక్కడి నుంచి హుజూర్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి భర్త సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


