ఎదురెదురుగా ఢీకొన్న కారు, బొలేరో | - | Sakshi
Sakshi News home page

ఎదురెదురుగా ఢీకొన్న కారు, బొలేరో

Oct 8 2026 3:54 AM | Updated on Oct 8 2026 3:54 AM

యాదగిరిగుట్ట రూరల్‌(మోటకొండూర్‌) : కారు, బొలేరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటన మోటకొండూర్‌ మండలం కాటేపల్లి సమీపంలో బుధవారం జరిగింది. ఎస్‌ఐ కుమారస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్‌(ఎం)కు చెందిన మజ్జిగ నరేష్‌ తన కారులో మోటకొండూర్‌ మండలంలోని కాటేపల్లి వైపు నుంచి ఆత్మకూర్‌(ఎం)కు వెళ్తున్నాడు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం కృష్ణారెడ్డిపేటకు చెందిన ఎండీ సమద్‌ ఖురేషి ఆత్మకూర్‌(ఎం) వైపు నుంచి బొలేరో వాహనంలో వస్తున్నాడు. ఈ రెండు వాహనాలు కాటేపల్లి సమీపంలోని బ్రిడ్జి వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. బొలేరో వాహనం బోల్తా పడగా.. కారు ధ్వంసమైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కుమారస్వామి తెలిపారు.

దొంగల ముఠాను పట్టుకున్న గ్రామస్తులు

ఫ పోలీసులకు అప్పగింత

చౌటుప్పల్‌ : మండల పరిధిలోని కొయ్యలగూడెం గ్రామస్తులు బుధవారం దొంగల ముఠాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కొయ్యలగూడెం, దేవలమ్మనాగారం గ్రామాలకు రెండు ఆటోలలో గుర్తుతెలియని మహిళలు, పురుషులు వచ్చారు. దేవలమ్మనాగారం గ్రామంలో రెండు ఇళ్ల తాళాలు పగులగొట్టి రెండు రాగి బిందెలను ఎత్తుకెళ్లారు. అటు నుంచి కొయ్యలగూడెం గ్రామానికి చేరుకున్నారు. అక్కడ సైతం ఓ తాళం వేసిన ఇంట్లోకి ప్రవేశించి రూ.16వేల నగదు, రాగి వస్తువులను ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన ఇంటి యజమాని ఊరెళ్లినప్పటికీ తలుపు తెరిచి ఉండడంతో గ్రామస్తులు లోపలికి వెళ్లి పరిశీలించగా దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంటనే ఇతర గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి గాలింపు నిర్వహించారు. ఈ క్రమంలో ఆటోలో పారిపోతున్న దొంగలను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వారిలో ముగ్గురు మహిళలు, ఆటో డ్రైవర్‌ ఉన్నారు. మరో ఆటో తప్పించుకుపోయినట్లు తెలుస్తోంది. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.

బోల్తాపడిన బొలేరో వాహనం

ప్రమాదంలో ధ్వంసమైన కారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement