ఆలయ అడుగు భాగంలో ఏర్పాటు చేసిన జాకీలు
జాకీల సహాయంతో జరుగుతున్న పనులు
కోదాడ రూరల్ : కోదాడ మండలం గుడిబండ గ్రామంలోని శ్రీసీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని 1976లో నిర్మించారు. ఆ సమయంలో ఆలయం రోడ్డుకు ఎత్తుగా ఉన్నది. కాలక్రమేణ కోదాడ–మేళ్లచెర్వు ప్రధాన రహదారి కావడంతో పలు దఫాలుగా రోడ్డు నిర్మాణం జరగడంతో ప్రస్తు తం ఆలయం.. రోడ్డుకు దిగువకు అయింది. దీంతో గ్రామస్తులు నూతన ఆలయం నిర్మించేందుకు చర్చలు జరిపారు. నూతన ఆలయ నిర్మాణం వ్యయప్రయాసలకు కూడుకున్నది కావడంతో ప్రస్తుతం ఉన్న ఆలయాన్నే రోడ్డుకు మించి ఎత్తు లేపేందుకు గ్రామస్తులు నడుంబిగించారు. ఈ పనుల్లో అత్యంత నైపుణ్యం కలిగిన ఉత్తరప్రదేశ్, కేరళకు చెందిన కాంట్రాక్టర్‌లతో ఒప్పందం చేసుకొన్నారు. 60 జాకీల సహా యంతో మొదటగా ఒక అడుగు ఎత్తు లేపి దాని కింద కాంక్రీట్ పనులు చేస్తున్నారు. ఆ తర్వాత మరో అడుగు లేపి రాతితో నిర్మాణం చేసి ఇలా ఐదు అడుగులు ఎత్తు లేపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పనులు జరగుతున్న సమయంలో ఆలయ గోడలకు, గోపురానికి ఎలాంటి పగుళ్లు రాకుండా కార్మికులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కార్తీక మాసంలో ఆలయ పునఃప్రతిష్ఠకు గ్రామస్తులు సన్నాహాలు చేస్తున్నారు.


