యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకొని శ్రీస్వామి అమ్మవార్లకు లక్ష పుష్పార్చన పూజ నిర్వహించారు. మంగళవారం సుప్రభాతం, అభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చన వంటి పూజలు జరిపించారు. అనంతరం ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవమూర్తులకు సంప్రదాయంగా వివిధ రంగులు, సుగంధ పరిమళాలు వెదజల్లే పూలతో లక్ష పుష్పార్చన చేశారు. శ్రీస్వామి అమ్మవార్లకు హారతినిచ్చారు. క్షేత్రపాలకుడికి ఆకుపూజ జరిపించారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన హోమం, నిత్య కల్యాణం, సాయంత్రం ఆలయ తిరుమాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు.


