డిండి : డిండి ప్రాజెక్టు స్పిల్‌వే రాళ్లు ఒక్కొక్కటిగా ఊడిపోతుండటం, మట్టికట్టలపై పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడంతో రైతులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో భారీ వరదలు వస్తే ప్రాజెక్టుకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, నీటిపారుదల శాఖ అధికారులు కనీస పర్యవేక్షణ, మరమ్మతులు చేపట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాగు, తాగునీటి అవసరాల కోసం 1940–43 మధ్య కాలంలో అప్పటి నిజాం ప్రభుత్వం డిండి ప్రాజెక్టును నిర్మించింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి ఉంది. ఎగువ ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురిసినప్పుడల్లా ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతుంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉన్నప్పుడు ఆయకట్టు కింద 15 వేల ఎకరాల వరకు భూమి సాగవుతుంది.
రాళ్లు ఊడిపోతున్నాయి..
స్పిల్‌వే కింది భాగంలో అప్పట్లో నిర్మించిన రాతి కట్టడాల నుంచి ప్రస్తుతం ఒక్కొక్కటిగా రాళ్లు ఊడిపోతున్నాయి. దీంతో స్పిల్‌వే రోజురోజుకూ బలహీనపడుతోంది. భవిష్యత్తులో ఎగువ ప్రాంతంలో కురిసే భారీ వర్షాలకు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగు పోస్తే.. ఆ వరద ఉధృతికి స్పిల్‌వే మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే పలు చోట్ల రాతి కట్టడాలు దెబ్బతినడంతో ముందస్తుగా మరమ్మతులు చేపట్టకపోతే భవిష్యత్తులో సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉందని రైతులు, స్థానికులు హెచ్చరిస్తున్నారు. గతేడాది వానా కాలంలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టు కుడి భాగాన ఉన్న చిన్న అలుగు గుండా ప్రవహించిన వరద ఉధృతిని తట్టుకోలేక హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారి బ్రిడ్జి వద్ద రోడ్డు కొట్టుకుపోయింది.
దర్శనమిస్తున్న పిచ్చిమొక్కలు
డిండి ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన మట్టికట్టల లోపల, బయట ముళ్ల పొదలను తలపించేలా పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. వాటి వేర్ల కారణంగా అక్కడక్కడ మట్టికట్టలకు పగుళ్లు ఏర్పడి దెబ్బతింటున్నాయి. ఈ పిచ్చిమొక్కలను తొలగించకపోవడంతో మట్టికట్ట ధ్వంసమవుతోంది. డిండి ప్రాజెక్టుపై ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ కరువైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు స్పందించి స్పిల్‌వే, మట్టికట్టలకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
ఫ ఊడుతున్న డిండి ప్రాజెక్టు
స్పిల్‌వే రాళ్లు
ఫ మట్టికట్టలపై ఏపుగా
పెరిగిన పిచ్చిమొక్కలు
ఫ మరమ్మతులు చేపట్టకుంటే
ప్రాజెక్టుకే ముప్పు
ఫ ఆందోళనలో రైతులు


