పాడి పశువులపై ‘లంపీ’ పంజా | - | Sakshi
Sakshi News home page

పాడి పశువులపై ‘లంపీ’ పంజా

Oct 7 2026 2:10 AM | Updated on Oct 7 2026 2:10 AM

ఫ ఆందోళనలో పాడి రైతులు

ఫ ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు

చేయాలని విజ్ఞప్తి

ఆత్మకూరు (ఎం) : పాడి పశువులకు వచ్చే లంపీ స్కిన్‌ (ముద్ద చర్మ) వ్యాధి పాడి రైతులను కలవరపెడుతోంది. ముఖ్యంగా ఆత్మకూరు(ఎం) మండలంలోని పలు గ్రామాల్లో పాడి పశువులు ఈ వ్యాధి బారిన పడుతున్నాయి. లంపీ స్కిన్‌ వ్యాధి నివారణకు ప్రత్యేకంగా ఎలాంటి టీకా లేకపోవడంతో పాడి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పశువైద్యులు యాంటీబయోటిక్స్‌, ఇతర మందులు అందిస్తూ వ్యాధిని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

వ్యాధి లక్షణాలు ఇవే..

లంపీ స్కిన్‌ వ్యాధి ముఖ్యంగా తెల్ల ఆవులకు ఎక్కువగా సోకుతుంది. ఈగలు, దోమలు, తేళ్లు, ఇతర కీటకాలు కుట్టడం వల్ల ఈ వ్యాధి ఒక పశువు నుంచి మరొక పశువుకు వ్యాపిస్తుంది. లంపీ స్కిన్‌ వ్యాధి బారిన పడిన పశువులకు నోరు, ముక్కుల నుంచి ద్రవాలు కారుతాయి. శరీరమంతా పొక్కులు ఏర్పడతాయి. వ్యాధి సోకిన పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. మేత మేయడానికి తీవ్ర ఇబ్బందులు పడతాయి. అధిక జ్వరం వచ్చి కొన్నిసార్లు మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంటుంది. ఈ వ్యాధి నివారణకు ప్రత్యేకమైన టీకా లేనప్పటికీ.. దీని వ్యాప్తిని అరికట్టేందుకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ముందస్తుగా సుమారు 60 వేల పాడి పశువులకు ‘గోట్‌పాక్స్‌’ వ్యాక్సిన్‌ వేశారు. పెద్ద పశువుల్లో రోగ నిరోధకశక్తి (ఇమ్యూనిటీ) ఉండటంతో అవి ఈ వ్యాధికి అంతగా గురికావడం లేదు. అయితే 6 నుంచి 8 నెలల వయసున్న లేగ దూడల్లో రోగ నిరోధకశక్తి తక్కువగా ఉండటంతో అవి లంపీ స్కిన్‌ బారిన పడుతున్నాయి. ఈ వ్యాధికి గురవుతున్న ఒక్కో పశువు చికిత్స కోసం సుమారు రూ.1,500 వరకు ఖర్చవుతోందని రైతులు పేర్కొంటున్నారు.

నివారణకు తీసుకోవాల్సిన చర్యలు

లంపీ స్కిన్‌ను తెలుగులో ‘ముద్ద చర్మ వ్యాధి’ అని అంటారు. సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రైతులు ఈ వ్యాధిని నివారించవచ్చు. ముఖ్యంగా పశువుల దొడ్డిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాల్లో క్రిమి కీటకాలు, దోమలు, ఈగలు రాకుండా చూసుకుంటూ, క్రిమి సంహారక మందులను పిచికారీ చేయాలి. వ్యాధి సోకిన పశువును ఇతర పశువులతో కలవకుండా దూరంగా ఉంచాలి. వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే మంద నుంచి వేరు చేయాలి. పశువైద్యుల సలహా మేరకు యాంటీబయోటిక్స్‌, ఇతర మందులు వాడటంతో పాటు శరీరంపై ఏర్పడిన పుండ్లకు ఆయింట్‌మెంట్‌ పూయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement