గ్రామంలో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తిసాగు చేశాను. గతేడాది ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈసారి చేను ఎదుగుదలలేదు. సరైన పూత రాలేదు. ఇటీవల కురిసిన వర్షం కొంత ఊరటనిచ్చింది. అయినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే దిగుబడి సగానికి పడిపోయే ప్రమాదం ఉంది.
– సాగర్ల సైదులు, కౌలురైతు వెల్లంకి,
రామన్నపేట మండలం
పత్తి రైతుల పరేషాన్
ఫ వర్షాభావ పరిస్థితులతో
ఎదుగుదల లోపించిన పత్తిచేలు
ఫ గతేడాది ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు దిగుబడి
ఫ ఈ సారి 5 క్వింటాళ్లు కూడా
వచ్చే పరిస్థితి లేదు
పది ఎకరాల నల్లరేగడి భూమిని కౌలుకు తీసుకొని పత్తిసాగు చేశాను. ఎకరాకు రూ.పదివేల చొప్పున ముందుగానే కౌలు చెల్లించాను. దున్నకం, విత్తనాలు, కలుపు తీయుట పెస్టిసైడ్స్ కోసం రూ 2లక్షల వరకు ఖర్చు చేశాను. రెక్కల కష్టం దేవుడెరుగు పెట్టుబడి డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదు.
– పాలడుగు నర్సయ్య,
మాసాన్‌పల్లి, గుండాల మండలం
రామన్నపేట : పత్తి రైతులు ఏటా నష్టాలను చవిచూస్తూనే ఉన్నారు. ఈ సారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పత్తిచేలు ఎదుగుదల లోపించింది. ఫలితంగా దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. లాభం దేవుడెరుగు కానీ, ఈ ఏడాది పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని, అప్పులపాలు కాక తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్‌లో రైతులు 1,12,521 ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. 2025 సీజన్‌తో పోలిస్తే ఈ సారి 22,421 ఎకరాల వరకు పత్తి సాగు విస్తీర్ణం తగ్గింది. కాగా జిల్లాలో సంస్థాన్ నారాయణపురం, అడ్డగూడూరు, వలిగొండ, రామన్నపేట, చౌటుప్పల్ మండలాల్లో ఈ సారి పత్తిని అధికంగా సాగుచేసినట్టు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
సీజన్ ప్రారంభం నుంచే సరైన వర్షాల్లేక..
సీజన్ ప్రారంభంలో వర్షాలు కురుస్తాయనే ఆశతో వేలాది మంది రైతులు పొడి దుక్కుల్లోనే పత్తి విత్తనాలు విత్తారు. వరుణుడు ముఖం చాటేయడంతో విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో చాలాచోట్ల రైతులు రెండు, మూడు పర్యాయాలు విత్తనాలు పెట్టుకోవాల్సి వచ్చింది. అదనపు విత్తనాల వ్యయంతోపాటు భూములను అచ్చు తోలడానికి, కూలీ ఖర్చుల కోసం ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో సాధారణ వర్షం కూడా కురువక పోవడంతో మొక్కలకు సరైన పోషకాలు అందక పత్తిచేలు ఎదుగుదల లోపించాయి. దీంతో రైతులు పూర్తిగా పత్తిచేలపై ఆశలు వదులుకున్నారు. ఇదే సమయంలో సెప్టెంబర్ 12, 13, 19 తేదీల్లో కురిసిన వర్షాలతో రైతుల్లో తిరిగి ఆశలు చిగురించాయి. దిగుబడి రావడం కోసం అడుగు మందులు పెట్టడం, కలుపు తీయడం, గుంటుకలు తోలే పనులు చేపట్టారు.
తగ్గనున్న దిగుబడి
ఈ యేడు పత్తి విత్తనాలు పెట్టినప్పడి నుంచి ఎప్పుడూ సకాలంలో వర్షాలు కురువలేదు. దీంతో చేలు ఎదగక కురుసగా మిగిలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పత్తిమొక్కలు అడుగు ఎత్తుకూడా ఎదగలేదు. పూత, పిందె రాలిపోగా మిగిలిన కాయలు సన్నగా పెరిగాయి. గతంలో ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. అలా దిగుబడి వస్తేనే రైతులకు గిట్టుబాటు అయ్యేది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరాకు రెండు నుంచి ఐదు క్వింటాళ్ల మించి దిగుబడి వచ్చే సూచనలు కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో పత్తిసాగు వివరాలు – 2026 (ఎకరాల్లో..)
పత్తిసాగు అంచనా 1,40,000
సాగైంది 1,12,521
దిగుబడి అంచనా 6.75 లక్షల క్వింటాళ్లు
2025లో పత్తిసాగు 1,34,942


