యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని ఆలయ అర్చకులు ఆదివారం ఉదయం పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించి, గర్భాలయంలో స్వయంభూ మూర్తులకు అభిషేక పూజను జరిపించారు. అనంతరం తులసీ దళాలతో సహస్ర నామార్చన, కుంకుమార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తుల చెంత అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన భక్తుల నడుమ నిర్వహించారు. ప్రథమ ప్రకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు జరిపించారు. సాయంత్రం వేళ జోడు సేవలను ఆలయ వీధుల్లో ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి అమ్మవార్లకు ప్రవళింపు సేవను నిర్వహించారు.
ఆర్టీసీ ఎన్నికల్లో ఐక్య కూటమిని గెలిపించాలి
యాదగిరిగుట్ట: ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ, టీఎంయూ, ఎంఎన్‌యూ ఐక్య కూటమిని గెలిపించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బాబు కోరారు. ఎ ఆదివారం యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ కార్మికులను కలిసి ఓటు అభ్యర్థించారు. ఆర్టీసీలో గత తొమ్మిదేళ్లుగా యూనియన్లు లేక కార్మికులు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడ్డారన్నారు. అశ్వత్థామరెడ్డి ఏనాడూ కార్మికుల యోగా క్షేమాలు పట్టించుకోలేదన్నారు. కార్మికుల సంక్షేమానికి ముందుకు వస్తున్న ఐక్య కూటమిని గెలిపించుకోవడం చాలా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి గోదా శ్రీరాములు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శులు కేఎస్‌రెడ్డి, మంగ, కార్యదర్శులు నరేందర్, జాల నర్సింహ పాల్గొన్నారు.
రేపు కమ్యూనిటీ కిచెన్ షెడ్‌కు శంకుస్థాపన
మునగాల: మండలంలోని మునగాల–మాధవరం గ్రామాల మధ్య జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేయనున్న కమ్యూనిటీ కిచెన్ షెడ్‌కు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్న 60వేల మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందించేందుకు రూ.9.60కోట్లతో కేంద్రీకృత వంటశాలను నిర్మించనున్నారు. దేశంలోనే అత్యాధునిక సదుపాయాలతో ఈ వంటశాలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంత్రి ఉత్తమ్, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి విజ్ఞప్తి మేరకు సింగరేణి సంస్థ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణానికి రూ.9.60కోట్ల విరాళం అందించింది.
ముగిసిన జిల్లాస్థాయి
అథ్లెటిక్స్ మీట్
సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని పాత ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ పోటీలు ఆదివారం ముగిశాయి. అండర్–14, అండర్–16 విభాగాలలో నిర్వహించిన 9రకాల ఈవెంట్స్‌లో సుమారు 450 మంది విద్యార్థులు పాల్గొన్నారు. బి.హరినాథ్, కె.ప్రవీణ్, సీహెచ్.నితిన్, ఈ.ప్రణయ్, సింధు, మౌనిక, వైష్ణవి, వినయ్‌లను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఎస్.ఫౌండేషన్ సీఈఓ వీరయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, చెంబులింగం, మైసయ్య, కార్తీక్, సునీత, విజయ్, కళమ్మ, మల్లేశ్వరి, ముక్కంటి, పరమేష్, అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చెరుకు వెంకటేష్ పాల్గొన్నారు.


